logo

చెరువుకు గాలాడట్లే

హైదరాబాదీయులకు పూర్వం తాగునీటిని అందించిన చెరువులు కాలుష్యం ధాటికి నామరూపాల్లేకుండా పోతున్నాయి.

Published : 05 Dec 2022 04:27 IST

రసాయన, నిర్మాణ వ్యర్థాలు చేరి విషతుల్యమవుతున్న నీరు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాదీయులకు పూర్వం తాగునీటిని అందించిన చెరువులు కాలుష్యం ధాటికి నామరూపాల్లేకుండా పోతున్నాయి. ఓ వైపు కబ్జాలతో కుంచించుకుపోతుండగా మరోవైపు ఉన్న కొద్దిపాటి నీళ్లలో రసాయన వ్యర్థాలు.. ప్లాస్టిక్‌.. చెత్తాచెదారం నిండడంతో ప్రాణవాయువు ఉండడం లేదు.
వర్షాలు పడిన సమయంలో భూమిలోని ఊటతో కళకళలాడే చెరువుల్లో ప్రాణవాయువు ఉంటుంది. చేపలు, ఇతర జలచరాలు జీవిస్తాయి. ఇందుకు భిన్నంగా గ్రేటర్‌లోని 185 తటాకాల్లో ప్రాణవాయువు తగ్గిపోతోంది. లీటర్‌ నీటిలో 6-8.5 మిల్లీగ్రాముల ఆక్సిజన్‌ ఉంటేనే నీటినాణ్యత బాగుంటుంది. గ్రేటర్‌లోని ఒక్క చెరువులోనూ ప్రాణవాయువు పరిమితులకు అనుగుణంగా లేదు. ప్రతి కాసారం వద్దకు వెళ్లి నీటి నమూనాలను సేకరిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వాటి స్థితిగతులను నివేదిక రూపంలో అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు. ఆక్సిజన్‌ తగ్గుతోందని జీహెచ్‌ఎంసీ, సాగునీటిశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు.

శివార్లలోనే ఎక్కువ..  గ్రేటర్‌లోని తటాకాల్లో ఎక్కువగా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల పరిధుల్లో ఉన్నాయి. ప్రమాణాలకు (పీహెచ్‌ 6-7 మధ్య ఉండాలి) అనుగుణంగా నీటినాణ్యత ఒక్క కాసారంలోనూ లేవు. ఇంతేకాదు.. కొన్ని చెరువుల్లో ఈ-వ్యర్థాలతోపాటు సీసం, లిథియంలతోపాటు భారలోహాలు కలుస్తున్నాయి. రాత్రివేళల్లో శివార్లలోని తటాకాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా, అక్రమార్కులు మట్టి, వ్యర్థాలను నింపకుండా నిఘా ఉంచేందుకు ఉద్యోగులున్నారు. యంత్రాంగం, ఉద్యోగులున్నా ఆయా కాసారాల్లోకి వ్యర్థజలాలు నిరాటంకంగా వెళ్తున్నాయి. నిర్మాణ వ్యర్థాలు యథేచ్ఛగా చేరుతున్నాయి. వీటన్నింటినీ అధికార యంత్రాంగం పట్టించుకోకుండా కొన్ని చెరువులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ సుందరీకరణ పనులు చేస్తోంది. అలా చేసిన వాటిలోనూ వ్యర్థాలు చేరుతున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.


ప్రాణవాయువూ.. నాణ్యత రెండూ లేవు

కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గ్రేటర్‌లోని 185 చెరువుల్లో నీటినాణ్యత పరీక్షలు జులైలో నిర్వహించారు. తర్వాత నిర్వహించిన నాణ్యత పరీక్షల ఫలితాలు రావాల్సి ఉండగా పీసీబీ అధికారులు కొద్దిరోజుల్లో మళ్లీ నాణ్యత, కాలుష్య ప్రమాణాలను పరీక్షించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు