logo

లింకు రోడ్ల నిర్మాణానికి జంకు

గ్రేటర్‌ చుట్టూ శివారుల్లో తలపెట్టిన రోడ్ల విస్తరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. పనులు చేపట్టిన హెచ్‌ఆర్‌డీసీఎల్‌(హైదరాబాద్‌ రహదారుల అభివృద్ధి సంస్థ) వద్ద నిధుల్లేవు.

Published : 05 Dec 2022 04:27 IST

ఆ పనులు మాకొద్దంటున్న గుత్తేదారులు
నిధుల్లేకపోవడమే సమస్య

జవహర్‌నగర్‌ చెన్నాపురం చౌరస్తా నుంచి ఆర్మీ ప్రాంతం మీదుగా సికింద్రాబాద్‌ వెళ్లే రోడ్డు దుస్థితి

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ చుట్టూ శివారుల్లో తలపెట్టిన రోడ్ల విస్తరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. పనులు చేపట్టిన హెచ్‌ఆర్‌డీసీఎల్‌(హైదరాబాద్‌ రహదారుల అభివృద్ధి సంస్థ) వద్ద నిధుల్లేవు. బ్యాంకుల నుంచి అప్పు లభించట్లేదు. విషయం గుత్తేదారుల వరకూ వెళ్లింది.  టెండర్లలో పాల్గొనేందుకు ముఖం చాటేశారు. మూడుసార్లు టెండరు నోటిఫికేషన్‌ ఇచ్చినా స్పందన కరవైంది. నెలల తరబడి ఇదే వరుస. లింకు రోడ్లు, రహదారుల విస్తరణే లక్ష్యంగా రెండేళ్ల క్రితం హెచ్‌ఆర్‌డీసీఎల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జీహెచ్‌ఎంసీ నిధులతో గ్రేటర్‌లో ఇప్పటికే రెండు దశల్లో పనులు మొదలై.. విజయవంతంగా సాగుతున్నాయి. మూడో దశలో నగర శివారుల్లోని పది పురపాలక సంస్థల పరిధిలోనూ అభివృద్ధి చేసేందుకు ఈ ఏడాది జులై 31న ప్రభుత్వం అనుమతిచ్చింది. రూ.1,500 కోట్లతో 120.92 కి.మీ. పొడవున హెచ్‌ఆర్‌డీసీఎల్‌ పనులకు శ్రీకారం చుట్టినా నిధుల లేమితో అడుగు కూడా ముందుకు పడడంలేదు. బ్యాంకు రుణం మంజూరు కాకపోవడంతో సమస్య తలెత్తిందని, టెండర్లను వాయిదా వేస్తున్నామని ఇంజినీర్లు వివరణ ఇచ్చారు. శివారు మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాటి పరిధిలో చేపట్టే పనుల వ్యయాన్ని భరించాలంటూ ప్రభుత్వం హెచ్‌ఎండీఏను ఆదేశించింది. హెచ్‌ఎండీఏ కొన్ని నెలలుగా రుణం కోసం విఫలయత్నం చేస్తోంది.  
మేడ్చల్‌ నియోజకవర్గంలో.. మేడ్చల్‌ నియోజకవర్గంలో 13 రోడ్లను రూ.417 కోట్లతో 33.5 కి.మీ. పొడవున అభివృద్ధి చేయాలని హెచ్‌ఆర్‌డీసీఎల్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లోని రోడ్లు ముఖ్యమైనవి. చెన్నాపురం చౌరస్తా నుంచి దమ్మాయిగూడ, డంపింగ్‌యార్డు, ఫైరింగ్‌ రేంజ్‌, ఒంపుగూడ ప్రాంతాల మధ్య రోడ్డు విస్తరణ పనులు 2003 నుంచి వాయిదా పడుతున్నాయి. ఇప్పుడు.. నిధుల సమస్య అడ్డంకిగా మారింది.  

ఐదు ప్యాజీలుగా..

* ప్యాకేజీ-1: శంషాబాద్‌, కొత్తూరు మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీలో రూ.304 కోట్లతో 25.2 కి.మీ. పొడవైన 7 లింకు రోడ్లు

* ప్యాకేజీ-2: బడంగ్‌పేట, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, జీహెచ్‌ఎంసీలో రూ.330 కోట్లతో 27.2 కి.మీ. పొడవైన 10 రహదారులు

* ప్యాకేజీ-3: జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీలో రూ.417 కోట్లతో 33.35 కి.మీ.

పొడవున 13 రోడ్లు

* ప్యాకేజీ-4: బండ్లగూడ జాగీర్‌ మున్సిపాలిటీ, జీహెచ్‌ఎంసీలోని రూ.297 కోట్లు 24.64 కి.మీ. పొడవున 11 రహదారులు.

* ప్యాకేజీ-5: బండ్లగూడ జాగీర్‌, జీహెచ్‌ఎంసీలో రూ.152 కోట్లతో 10.53 కి.మీ. పొడవైన 9 లింకు రోడ్లు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని