logo

సంక్షిప్త వార్తలు

ఉస్మానియా వర్సిటీలోని విద్యాకళాశాల వద్ద గల వారసత్వ బావిని పునరుద్ధరించాలని మంత్రి కేటీఆర్‌ ఆదివారం ట్విటర్‌లో హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ను ఆదేశించారు.

Updated : 05 Dec 2022 05:34 IST

ఓయూలోని వారసత్వ బావిని పునరుద్ధరిస్తాం: మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా వర్సిటీలోని విద్యాకళాశాల వద్ద గల వారసత్వ బావిని పునరుద్ధరించాలని మంత్రి కేటీఆర్‌ ఆదివారం ట్విటర్‌లో హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ను ఆదేశించారు. వర్సిటీ విద్యాకళాశాల విద్యార్థి ఒకరు కేటీఆర్‌కు ట్విటర్‌లో ఈ బావి దుస్థితిని తెలియజేస్తూ బాగు చేయాలని కోరారు. మంత్రి వెంటనే స్పందిస్తూ ఉస్మానియా ఉపకులపతిని సంప్రదించి వెంటనే పనులు చేపట్టాలని కమిషనర్‌కు సూచించారు.


నుమాయిష్‌ వచ్చే నెలే!

అబిడ్స్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌ అనంతరం పూర్తి స్థాయిలో ‘నుమాయిష్‌’ నిర్వహణకు ఎగ్జిబిషన్‌ సొసైటీ ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు  అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన(ఎగ్జిబిషన్‌)ను నుమాయిష్‌ పేరుతో 1938 నుంచి నిర్వహిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. కొవిడ్‌తో 2021లో నిర్వహించలేదు. 2022లో జనవరి 1న ప్రారంభించి రెండో రోజునే నిలిపి వేయగా, ఫిబ్రవరి 25న తిరిగి ప్రారంభించి ఏప్రిల్‌ 14వ తేదీ వరకు కొనసాగించారు. ఈసారి మాత్రం 46 రోజుల పాటు నిర్ణీత సమయంలో నిర్వహించేందుకు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టడంలో ఎగ్జిబిషన్‌ సొసైటీ నిమగ్నమైంది.


అభివృద్ధిపై దృష్టి సారించాలి

అంబర్‌పేట, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు మానుకుని అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని తెలంగాణ, ఏపీ బ్రాహ్మణ సమాజ్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు గిరిప్రసాద్‌శర్మ కోరారు. ఆదివారం కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం మానుకోవాలన్నారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను తితిదే బోర్డులో నియమించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో అన్యమత ఉద్యోగులను తొలగించాలని కోరారు. నిరంజన్‌కుమార్‌ దేశాయ్‌, మంగపతిరావు, శ్రీనివాస్‌రెడ్డి, ఫారూక్‌పాషా పాల్గొన్నారు.


శుభకార్యాల సందడి మొదలు

ఈనాడు, హైదరాబాద్‌: ఆదివారం నగరంలో శుభకార్యాలు ఎక్కువ ఉండడంతో రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. మరీ ముఖ్యంగా ఫంక్షన్‌ హాళ్లు ఎక్కువగా ఉన్న దారులన్నీ ట్రాఫిక్‌ జామ్‌లయ్యాయి. కర్మన్‌ఘాట్‌, ఎల్బీనగర్‌, శంషాబాద్‌, నర్సాపూర్‌, బోయినపల్లి, నాగోల్‌, అల్కాపురి కాలనీ చౌరస్తా, బీఎన్‌రెడ్డినగర్‌, హస్తినాపురం, ఆరాంఘర్‌ చౌరస్తా, మియాపూర్‌ చౌరస్తాలలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద వాహనాలు దాటడానికి అరగంట పట్టింది. చాలారోజుల తర్వాత మంచి ముహూర్తాలు మొదలుకావడం, అదీ సెలవుదినం ఆదివారం అవ్వడంతో నగరవాసులంతా ఫంక్షన్‌హాల్స్‌ బాటపట్టారు.  


ఉత్సాహంగా రాకథాన్‌

గోల్కొండ, న్యూస్‌టుడే: సొసైటీ టూ సేవ్‌ రాక్స్‌ అండ్‌ గ్రేట్‌ హైదరాబాద్‌ అడ్వెంచర్‌ క్లబ్‌లు సంయుక్తంగా ఆదివారం తారామతి-బారాదరి వద్ద ఉన్న ఘర్‌ ఏ ముబారక్‌ వద్ద నిర్వహించిన 9వ హైదరాబాద్‌ రాకథాన్‌ ఉత్సాహభరితంగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ ఇండస్ట్రీ అండ్‌ కామర్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌రంజన్‌ మాట్లాడుతూ చారిత్రక రాక్‌లతో పాటు పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. సొసైటీ టూ సేవ్‌ రాక్స్‌ అధ్యక్షురాలు ఫాతిమా అలీఖాన్‌, గ్రేట్‌ హైదరాబాద్‌ అడ్వెంచర్‌ క్లబ్‌ అధ్యక్షుడు మణిదీప్‌ పాల్గొన్నారు.


పార్లమెంటు భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలి: పిడమర్తి

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన మేరకు నూతన పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ పిడమర్తి రవి కేంద్రప్రభుత్వాన్ని డిమాండు చేశారు. దీంతోపాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో బహుజన స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (బీఎస్‌ఎఫ్‌) ఓయూ అధ్యక్షుడు బోరెల్లి సురేష్‌ ఆధ్వర్యంలో చలో దిల్లీ గోడపత్రిక విడుదల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పిడమర్తి రవి హాజరై గోడ పత్రిక ఆవిష్కరించారు.  కార్యక్రమంలో ఆలేటి శ్రీశైలం, గాదె వెంకట, మొగులయ్య, వెంకటేష్‌, ప్రసాద్‌, సాయన్న పాల్గొన్నారు.


హకీంపేటకు చేరిన ఫ్లయింగ్‌ ఎక్స్‌పెడిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, ది ఆర్మీ సర్వీస్‌ కార్ప్స్‌ 11వ రీయూనియన్‌ వేడుకల్లో భాగంగా ఆర్మీ మైక్రోలైట్‌ ఫ్లయింగ్‌ ఎక్స్‌పెడిషన్‌ బృందం ఆదివారం హకీంపేటకు చేరుకుంది. నవంబర్‌ 30న ప్రారంభం కాగా.. 17 రోజుల్లో నాలుగు విమానాలు, 5 వేల కిలోమీటర్ల ఏరియల్‌ దూరం కంటే ఎక్కువగా ప్రయాణించే లక్ష్యంతో ఈ సాహస బృందం వేర్వేరు ప్రదేశాలను సందర్శిస్తోంది. గయాకు చెందిన ఆర్మీ అడ్వెంచర్‌ నోడల్‌ సెంటర్‌ (మైక్రోలైట్‌) ఆర్మీ అడ్వంచర్‌ వింగ్‌ ఆధ్వర్యంలో యాత్ర నిర్వహిస్తున్నారు. బృందంలో బృంద నేత కల్నల్‌ ఎల్‌.కె.యాదవ్‌, కల్నల్‌ రాహుల్‌, లెఫ్టనెంట్‌ కల్నల్‌ బీపీ సింగ్‌, హెచ్‌సీ జోషి, రాప్‌ కేశ్‌, సోరెన్‌, ధర్మేంద్ర, సుర్వే, ఎన్‌.కె.ప్రదీప్‌, ఎన్‌.కె.విజయ్‌కుమార్‌ యాదవ్‌, సుబేదార్‌ వినోద్‌కుమార్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని