logo

బాకీ తీర్చలేదని హత్య

బాకీ తీర్చలేదని వ్యక్తిని ఇనుపరాడ్‌తో తలపై బాది హతమార్చిన ఘటన బాలాపూర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సైలు సైదులు, యూసుఫ్‌ జానీ కథనం ప్రకారం..

Published : 05 Dec 2022 04:27 IST

కుర్చీలోనే కన్నుమూసిన  ఇస్మాయిల్‌

పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే: బాకీ తీర్చలేదని వ్యక్తిని ఇనుపరాడ్‌తో తలపై బాది హతమార్చిన ఘటన బాలాపూర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సైలు సైదులు, యూసుఫ్‌ జానీ కథనం ప్రకారం.. జల్‌పల్లి పురపాలిక వాది ఎ హుదాలో ఉండే ఇస్మాయిల్‌ ఖాద్రి(40)కి ఇద్దరు భార్యలు. 8 నెలల క్రితం సమీపంలోని షాహిన్‌నగర్‌లో ఉండే ఆటోడ్రైవర్‌ సలీం వద్ద రూ.2.5 లక్షలు అప్పుచేసిన ఖాద్రి.. ఓ కారు కొన్నాడు. ఆ అప్పు తీర్చే విషయంలో పెద్ద భార్యతో వివాదం ఏర్పడింది. ఆమె స్థానికంగా తనపేర ఉన్న ఇల్లు విక్రయించి భర్తతో తెగతెంపులు చేసుకుని వెళ్లిపోయింది. అదే ఇంటిముందు అద్దె ఇంట్లో ఖాద్రి నివసిస్తున్నాడు. అప్పు తీసుకుని 8 నెలలు గడిచినా, ఇల్లు విక్రయించినా తన బాకీ తీర్చడంలేదని ఖాద్రిపై.. సలీం కక్ష పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి  ఇస్మాయిల్‌ ఇంటికి వెళ్లాడు. వాగ్వాదం పెట్టుకున్నాడు. ఆగ్రహంతో ఎదురుగా కుర్చీలో కూర్చున్న ఇస్మాయిల్‌ తలపై ఇనుపరాడ్‌తో రెండుసార్లు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు గంటల అనంతరం నిందితుడు బాలాపూర్‌ ఠాణాకు వెళ్లి తాను హత్య చేశానని చెప్పాడు. హత్యా స్థలానికి ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌ చేరుకొని పరిశీలించారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని