logo

వడివడిగా బీజాపూర్‌ రహదారి విస్తరణ

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హైదరాబాద్‌- బీజాపూర్‌ జాతీయ రహదారి విస్తరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి.

Published : 05 Dec 2022 04:48 IST

మన్నెగూడ వద్ద రోడ్డు చదును

న్యూస్‌టుడే, పూడూరు, తాండూరు: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హైదరాబాద్‌- బీజాపూర్‌ జాతీయ రహదారి విస్తరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు ఇప్పుడున్న రెండు వరుసలను తొలగించి నాలుగు వరుసల నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. నిధులు కూడా విడుదల కావటంతో ఇప్పటికే ఓ ప్రైవేటు సంస్థ కాంట్రాక్టును దక్కించుకుంది. భూములు కోల్పొతున్న రైతులకు ప్రభత్వ పరంగా రావాల్సిన పరిహారాన్ని బాధితులకు అందించింది. అడ్డంకులు తొలగటంతో గుత్తేదారు పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చారు.

సుమారు 4 కి.మీ.

జిల్లా సరిహద్దు అంగడిచిట్టంపల్లి గేటు నుంచి మన్నెగూడ వరకు సుమారు 4 కిలో మీటర్ల మేర చేపట్టనున్న విస్తరణలో భాగంగా పొలాలు ఎంతవరకు పోతున్నాయనే దానిపై ఇరువైపులా హద్దు రాళ్లు ఏర్పాటు చేసి పసుపురంగు గుర్తులు వేశారు. వారం రోజుల నుంచి జేసీబీలతో చదును చేసేపనులు ప్రారంభించారు. అంగడిచిట్టంపల్లి గేటు నుంచి పూడూరు వైపు వస్తుంటే ఎడమ వైపున మలుపులను తగ్గించాలనే ఉద్దేశంతో ఎక్కువ మొత్తంలో భూములు సేకరించారు.

ఇంత తొందరగా.. అనుకోలేదు..

రహదారి పనులు ఇప్పుడే ప్రారంభం కావని భావించి రైతులు యాసంగి పంటలు వేశారు. తీరా చూస్తే వారం క్రితమే ఊపందుకున్నాయి. దీంతో రైతులకు ఆర్థికంగా తీవ్ర నష్టం కలగనుంది. ఖరీఫ్‌లో వేసిన కంది, పత్తి, పూలు వంటి వివిధ కూరగాయ పంటలు దాదాపు పూర్తి కావస్తుండటంతో వారం రోజుల్లోగా పంట తీసేపనులు పూర్తిచేయాలని గుత్తేదారులు నిబంధనలు పెట్టారు.

* కొందరు రైతులు యాసంగిలో కుసుమ, శనగ వంటి పంటలు వేశారు. పంట చేతికి రావాలంటే కనీసం రెండు నెలలు అవసరం. అప్పటివరకు ఆగే పరిస్థితి కనిపించక పోవటంతో అన్నదాతలు పెట్టుబడులు పెట్టుకుని ఆందోళన చెందుతున్నారు. అంగడిచిట్టంపల్లి గేటు నుంచి మన్నెగూడ వరకు ఇరువైపులా సుమారు 20 ఎకరాల వరకు వివిధ పంటలు, మామిడి తోటలు కోల్పోక తప్పదు. కండ్లపల్లి సమీపంలో సాగులో ఉన్న పచ్చటి కుసుమ పొలాన్ని జేసీబీతో చదును చేయించి నేలమట్టం చేశారు.

రైతులు మొరపెట్టుకున్నా..

పంటలు పూర్తయ్యేవరకు గడువు ఇవ్వాలని పేర్కొంటూ కండ్లపల్లికి చెందిన కొందరు రైతులు గుత్తేదారులను వేడుకున్నారు. తమ చేతుల్లో ఏం లేదని పంటలు ఉన్నా ఏదైనా నిర్మాణాలు ఉన్నా వారం పది రోజుల్లోగా కూల్చివేయాల్సిందే అంటూ సమాధానం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని