logo

కంది.. నిలువునా ఎండుతోంది..!

జిల్లాలో జులై నుంచి సెప్టెంబరు వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల ప్రభావం ప్రస్తుతం సాగులో ఉన్న కందిపంటపై కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

Published : 05 Dec 2022 04:48 IST

బుద్దారంలో పొలంలోనే పంట స్థితి

న్యూస్‌టుడే, తాండూరు, వికారాబాద్‌, ధారూర్‌: జిల్లాలో జులై నుంచి సెప్టెంబరు వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల ప్రభావం ప్రస్తుతం సాగులో ఉన్న కందిపంటపై కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జూన్‌లో తొలకరి వర్షాలు కురియగానే రైతులు విత్తనాలు వేశారు. మొత్తంగా 1.50 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. సస్యరక్షణ చర్యలు చేపట్టాక మరింత ఆరోగ్యంగా పెరిగాయి. ఈనేపథ్యంలో ఈసారి కంది దిగుబడులు ఎకరాకు కనీసం 4 క్వింటాళ్ల నుంచి 6 క్వింటాళ్ల వరకు వస్తాయని అంచనా వేశారు. అయితే జులై నుంచి సెప్టెంబరు వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల ప్రభావం ప్రస్తుతం పూత, కాత దశ చేరిన పైర్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పైరు నిలువునా ఎండి పోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.

మద్దతుకు మించిన ధరలే

క్వింటాలు కందులకు ప్రభుత్వం రూ.6,600 మద్దతు ధరను ప్రకటించింది. వ్యాపారులు కందుల కొనుగోలుకు పోటీ పడడంతో క్వింటాలుకు రూ.6,950 నుంచి రూ.7,200 ధర లభిస్తోంది.  

అధిక తేమ కారణం

భారీ వర్షాల నేపథ్యంలో కంది పంటలు సాగయ్యే భూముల్లో తేమ శాతం విపరీతంగా పెరిగింది. దీనికి తోడు మేఘావృతమైన వాతావరణం తోడైంది. నిరంతర వర్షాల కారణంగా పైర్ల ఆకులపై తేమ ఉండి పోవడం, మురుగు నీరు అక్కడే నిలిచి పోవడం వంటి కారణాలతో పైర్లను ఎండు తెగులు ఆశించాయి. భూమిలో నిద్రావస్థలో ఉన్న శిలీంద్రాలు బయటికి వచ్చి పంటను నష్ట పరిచాయి. ఎండు తెగులు ప్రభావంతో ప్రతి ఎకరంలో 30 నుంచి 40 శాతం దిగుబడులు తగ్గే వీలుంది.  

వచ్చే ఏడాది ఇలా జరగకుండా ఉండాలంటే..

వచ్చే ఏడాది వానాకాలం సీజన్‌లో సాగు చేసే కందిపంటలకు ఎండుతెగులు సోకకుండా ఉండాలంటే రైతులు కొన్ని పద్ధతులు పాటించాలి. కందిని సాగు చేసే పొలాల్లో జొన్న సాగుతో పంట మార్పిడి చేయాలి. ఎండు తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. కాబట్టి తెగుళ్లను తట్టుకునే రకాలను విత్తనాలుగా వేసుకోవాలి. విత్తడానికి ముందు ఎకరానికి రెండు కిలోల ట్రైకోడర్మా విరిడిని, 25 కిలోల చివికిన పశువుల ఎరువును చల్లి కలియ దున్నాలని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు.

* కాయ తొలుచు లేదా శనగపచ్చ పురుగు ఆకులు, పూల మొగ్గలు, పిందెలపై తల్లి పురుగు గుడ్లను పెడుతోంది. తొలిదశలోనే పురుగు తీవ్రతను గమనించి వేప నూనె 5 మిల్లీ లీటర్లు, ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతిని నివారించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని