logo

పర్యాటకానికి ఊపునిచ్చేలా.. బావితరాలు మెచ్చేలా

దశాబ్దాలకిందట ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన మెట్లబావి అది.. బావిలో నీటిమట్టం మేరకు చేదుకుని వాడుకోవడం, లేదా నీరు అడుగుకి వెళ్లి పోతే మెట్లద్వారా కిందకు దిగి నీటిని తీసుకునేలా అద్భుతమైన నిర్మాణాలతో తీర్చిదిద్దిన ఆ బావి..

Published : 05 Dec 2022 04:58 IST

నేడు బన్సీలాల్‌పేట మెట్లబావి ప్రారంభం

విద్యుత్తు వెలుగుల్లో కొత్త అందాలతో..

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: దశాబ్దాలకిందట ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన మెట్లబావి అది.. బావిలో నీటిమట్టం మేరకు చేదుకుని వాడుకోవడం, లేదా నీరు అడుగుకి వెళ్లి పోతే మెట్లద్వారా కిందకు దిగి నీటిని తీసుకునేలా అద్భుతమైన నిర్మాణాలతో తీర్చిదిద్దిన ఆ బావి.. కాలక్రమంలో నిరాదరణకు గురై, డంపింగ్‌ యార్డుగా తయారైంది. ఈ అద్భుత చారిత్రక కట్టడాన్ని భవిష్యత్తు తరాలకు చూపాలనే ఉద్దేశంతో, ఉనికినే కోల్పోయిన ఆ బావిని పునరుద్ధరించి అభివృద్ధి చేయడంతో ఇప్పుడు చూసేవారికి కనువిందు చేసేలా సుందరంగా తయారైంది. అదే సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట మెట్లబావి. దీన్ని సోమవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.

నగరంలో మొత్తం 44..

నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 44 మెట్లబావులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. వాటిల్లో బన్సీలాల్‌పేట మెట్లబావి ఒకటి. ఆ కాలంలో నాగన్న కుంటగా పిలిచేవారని చారిత్రక ఆధారాలున్నాయి.

* హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 2021 ఆగస్టులో పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. వ్యర్థాల తొలగింపు, పునరుద్ధరణకుగాను రూ.1.80కోట్లు వెచ్చించారు. పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం, రంగులు, టూరిజం ప్లాజా నిర్మాణం, లైటింగ్‌ తదితరాల పనులకు రూ.2.80కోట్లు ఖర్చుచేశారు. వేడుకలు నిర్వహించుకునేందుకు సీట్లతో కూడిన గార్డెన్‌ నిర్మించారు.  


పురాతన కట్టడాలను పరిరక్షించాలనే
-మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

పురాతన కట్టడాలను పరిరక్షించి భావితరాలకు అందించాలన్నదే ప్రభుత్వ ఆలోచన. అందులో భాగంగానే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఈ మెట్లబావిని పునరుద్ధరించి అభివృద్ధి చేశారు. సోమవారం ప్రారంభించడంతో సందర్శకులకు అందుబాటులోకి రానుంది. భవిష్యత్తులో మంచి పర్యాటక కేంద్రం అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని