logo

రవాణా శాఖ రివర్స్‌గేర్‌

అన్ని ప్రభుత్వ విభాగాలు ఆధునిక దిశలో దూసుకుపోతుంటే రవాణా శాఖ మాత్రం పాత పద్ధతుల వైపు అడుగులు వేస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్సు కార్డులు మొన్నటి వరకు చిప్‌తో కూడిన అత్యాధునికమైనవి జారీ చేయగా..

Published : 05 Dec 2022 04:58 IST

చిప్‌లేని కార్డులు.. నాణ్యతలేని నంబర్‌ ప్లేట్ల పంపిణీ

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: అన్ని ప్రభుత్వ విభాగాలు ఆధునిక దిశలో దూసుకుపోతుంటే రవాణా శాఖ మాత్రం పాత పద్ధతుల వైపు అడుగులు వేస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్సు కార్డులు మొన్నటి వరకు చిప్‌తో కూడిన అత్యాధునికమైనవి జారీ చేయగా.. ఈ కార్డులను సరఫరా చేసే గుత్తేదారుకు డబ్బులు చెల్లించలేక.. చిప్‌లేని కార్డులను కొన్ని రోజులుగా నగరంతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో జారీ చేయడం మొదలుపెట్టారు. మరోవైపు వాహనాల నంబర్‌ ప్లేట్ల నాణ్యత మూణ్నాళ్ల ముచ్చటగా మారిపోయింది.  

రూ. 3 కోట్ల బకాయిలు..

దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రం సమయంలోనే అత్యాధునిక చిప్‌తో కూడిన కార్డులను రవాణా శాఖ ప్రవేశపెట్టింది. వాహన రిజిస్ట్రేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకునే వారి వివరాలన్నింటిని ఈ చిప్‌లో నమోదు చేస్తారు. సమస్త సమాచారం ఈ చిప్‌లలో ఉండటం వల్ల వాహనదారు ఏదైనా ప్రమాదానికి గురైతే ఈ కార్డు ఆధారంగా వివరాలు తీసుకునేవారు. కార్డులను సరఫరా చేసే గుత్తేదారుకు గత రెండేళ్ల నుంచి రవాణా శాఖ పూర్తిస్థాయిలో నిధులు చెల్లించకపోవడంతో కొన్ని నెలలుగా సదరు గుత్తేదారు కార్డుల పంపిణీని నిలిపివేశారు. ఇలా నాలుగైదు సార్లు జరిగింది. వాహనదారులకు కార్డుల పంపిణీ ఆగిపోయింది. దీంతో బకాయిలో 30 శాతం వరకు చెల్లించడంతో కార్డుల పంపిణీ మొదలుపెట్టారు. తాజాగా కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన మొత్తం రూ.3 కోట్లకు చేరిందని అధికారులు తెలిపారు. దీంతో కార్డుల పంపిణీ ఆపేశారు. రవాణా శాఖ కొంత నిధులను విడుదల చేయడంతో చిప్‌లేని కార్డుల పంపిణీకి కాంట్రాక్టర్‌ అంగీకరించారు. పది రోజుల నుంచి చిప్‌లేని కార్డులనే  పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడవే కార్డులను వాహనదారులకు పంపిస్తున్నారు.

వాహనాల సామర్థ్య పరీక్ష అంతంతే!

అనేక రాష్ట్రాల్లో వాహనాల సామర్థ్య పరీక్షను యాంత్రీకరించారు. రాష్ట్రంలో కూడా చౌటుప్పల్‌ దగ్గర అత్యాధునికమైన వాహన సామర్థ్య నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సర్కారు తలపెట్టింది. అక్కడ స్థల వివాదంతో అలాగే వదిలేశారు. అధికారులే తూతూమంత్రంగా పరీక్ష చేసి సర్టిఫికెట్‌ ఇచ్చేస్తున్నారు. భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

వంగిపోతున్న నంబర్‌ ప్లేట్ల్లు

ఉమ్మడి ప్రభుత్వం హయాంలోనే హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్ల పంపిణీని మొదలుపెట్టారు. అప్పట్లో వాటి వ్యయంపై  ఆరోపణలు రావడంతో.. ఈ నంబర్‌ ప్లేట్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ చిప్‌తోపాటు ఇతరత్రా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. తరువాత రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థను ఉపసôహరించారు. ప్రస్తుతం నంబర్‌ప్లేట్‌పై హాలోగ్రామ్‌ మాత్రమే ఉంది. అవైనా నాణ్యతగా ఉన్నాయా అంటే అదీ లేదు. గట్టిగా అదిమిపెడితే వంగిపోతోందని, బిగించిన తరువాత  ఊడిపోతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. నంబర్‌ ప్లేటు ఊడిపోతే మళ్లీ ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకుంటే నెలరోజులకు గానీ రావడం లేదు. దీనికి రూ.800 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని