logo

వాయు గండం

నగరంలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటేస్తోంది. చలి పెరుగుతున్న కొద్దీ రోజురోజుకూ గాలిలో నాణ్యత పడిపోతోంది.

Updated : 06 Dec 2022 05:10 IST

ప్రమాదకర స్థాయిని దాటేస్తున్న కాలుష్యం
సనత్‌నగర్‌, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అత్యధికం

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటేస్తోంది. చలి పెరుగుతున్న కొద్దీ రోజురోజుకూ గాలిలో నాణ్యత పడిపోతోంది. లక్షల సంఖ్యలో వాహనాల నుంచి వచ్చే పొగ మేఘాలు కమ్మేస్తుండడంతో గాలిలో కాలుష్యం వేగంగా పెరుగుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. సనత్‌నగర్‌లో గాలి నాణ్యత సూచీలో గరిష్ఠ స్థాయి 333 పాయింట్లు నమోదు కాగా సగటున 237 పాయింట్లు నమోదైంది. రాబోయే రోజుల్లో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకపోతే దిల్లీ తరహాలోనే మనమూ డేంజర్‌ జోన్‌లోకి వెళ్లే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

3 ప్రాంతాల్లో వందకుపైగా

గాలి నాణ్యత సూచీలో యాభై పాయింట్లు దాటితే ఎవరికైనా ఊపిరి పీల్చుకోవడం కష్టమే. జూపార్క్‌, సనత్‌నగర్‌, కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీలో అత్యధికంగా 180 పైగా పాయింట్లు నమోదయ్యాయి. కలుషిత గాలి ఆరోగ్యవంతులపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా ఆస్తమా రోగులకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుందని నిపుణులు తెలిపారు.

బెంగళూరు నయం

కోటికిపైగా జనాభా ఉన్న మెట్రోనగరాల విభాగంలో బెంగళూరు కాస్త పర్వాలేదన్న స్థితిలో ఉంది. అక్కడ సోమవారం గాలి నాణ్యత సూచీలో 79 పాయింట్లు నమోదైంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో వాయుకాలుష్యం డిసెంబరు ప్రారంభం నుంచే క్రమంగా పెరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా చెన్నైలో 129 పాయింట్లు ఉండగా హైదరాబాద్‌లో 125 పాయింట్లు నమోదైంది. మరోవైపు దిల్లీలో 374, ముంబయిలో 274గా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు