logo

జీతాలకు ఎదురుచూపులు

ఐదో తేదీ వచ్చినా జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఖజానాలో నిధుల్లేకపోవడంతో ఉన్నతాధికారులు చేతులెత్తేశారు.

Published : 06 Dec 2022 02:21 IST

ఖజానాల్లో నిధుల్లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ తాత్సారం  

ఈనాడు, హైదరాబాద్‌: ఐదో తేదీ వచ్చినా జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఖజానాలో నిధుల్లేకపోవడంతో ఉన్నతాధికారులు చేతులెత్తేశారు. ఎప్పుడు జీతం చెల్లిస్తారనే ప్రశ్నకూ సమాధానం చెప్పట్లేదు. గతంలో ఒకటో తేదీన కార్మికులు, ఉద్యోగులందరికీ జీతాలందేవి. రెండేళ్లుగా చెల్లింపునకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి, పరిమితికి మించి అప్పు చేయడంతో ఈ దుస్థితి ఏర్పడిందనే విమర్శలొస్తున్నాయి.

అప్పుల భారం..

పైవంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్‌యూబీ, ఆర్వోబీల నిర్మాణం, వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ఆర్‌డీపీ), లింకు రోడ్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ గడిచిన ఐదేళ్లలో రూ.4000 కోట్ల అప్పు చేసింది. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ఎన్‌డీపీ) కోసం మరో రూ.750 కోట్ల రుణం తీసుకుంది. ఇతర ప్రాజెక్టులకూ రుణాల ద్వారా నిధులు సమీకరించింది. రూ.1,250 కోట్ల ఆస్తిపన్ను, రూ.1000 కోట్ల నిర్మాణ అనుమతుల రుసుం, ఇతర మార్గాల్లో మరో రూ.150 కోట్లు జీహెచ్‌ఎంసీకి సమకూరుతున్నాయి. గ్రాంట్ల రూపంలో సర్కారు నుంచి సకాలంలో నిధులు రావట్లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.5వేల కోట్ల ఆస్తిపన్ను బకాయిలు వసూలు కాని పరిస్థితి. రాష్ట్ర పద్దులో బల్దియాకు ఇస్తామంటూ పేర్కొనే నిధులు.. కాగితాలకే పరిమితం. ఇక.. రవాణా, పారిశుద్ధ్య విభాగం, రహదారుల నిర్వహణ వంటి పనులను  ప్రైవేటుకు ఇవ్వడంతో.. ఖర్చు రెట్టింపైంది. గతంలో రూ.1000కోట్ల ఎఫ్‌డీ ద్వారా అందే వడ్డీతో జీతాలు చెల్లిస్తూ వచ్చిన జీహెచ్‌ఎంసీ.. నేడు అప్పులకు వడ్డీ కట్టలేని స్థితికి చేరుకుంది. నెలకు రూ.120 కోట్ల  వడ్డీ చెల్లిస్తున్నామని, దాంతో.. ప్రతి నెలా రూ.110కోట్ల మేర జీతాలకు నిధులను సర్దుబాటు చేయడం కష్టంగా మారిందని అధికారులే చెబుతున్నారు. ప్రస్తుతం పొరుగు సేవల కింద పనిచేసే 20వేల మంది కార్మికులకు జీతాలిచ్చామని, ఫించనుదారులకు నిధులు విడుదల చేశామని, 5వేల మంది పూర్తిస్థాయి ఉద్యోగులకు చెల్లించాల్సి ఉందని వివరించారు. పదో తేదీ నాటికి నిధులు సమకూరే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని