logo

సమస్య పరిష్కరిస్తారా.. ఆత్మహత్య చేసుకోవాలా?

‘సార్‌.. మా పేరుపై ఉన్న భూమిని మేం ఎవ్వరికీ అమ్మలేదు. ఇటీవల ధరణి పోర్టల్‌లో మా పేర్లను మార్చేశారు. మా సమస్యను పరిష్కరిస్తారా..? లేదా అంటూ ఓ మహిళ సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ ఎదుట బ్లేడు తీసింది.

Published : 06 Dec 2022 02:21 IST

అదనపు కలెక్టర్‌ ఎదుట గొంతు కోసుకునేందుకు యత్నిస్తున్న జయశ్రీ

ఆదిభట్ల, న్యూస్‌టుడే: ‘సార్‌.. మా పేరుపై ఉన్న భూమిని మేం ఎవ్వరికీ అమ్మలేదు. ఇటీవల ధరణి పోర్టల్‌లో మా పేర్లను మార్చేశారు. మా సమస్యను పరిష్కరిస్తారా..? లేదా అంటూ ఓ మహిళ సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ ఎదుట బ్లేడు తీసింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కవాడిపల్లికి చెందిన సుర్వి భిక్షపతి తన ఆస్తిలో 1.30 ఎకరాల భూమిని నలుగురు కుమార్తెలు బద్దం నిర్మల, బత్కుల జయశ్రీ, సుర్వి ఉమావతి, సుర్వి ప్రభావతి పేర్లపై గిఫ్ట్‌ డీడ్‌ చేశారు. ఇటీవల ఆయన మరణించారు. నలుగురు మహిళల పేరుపై ఆస్తి ఉన్నట్లు ధరణి పోర్టల్‌లో ఉంది. గత నెల 25 నుంచి వీళ్ల పేర్లు మారి ఇతరుల పేర్లు చేరాయి. అవాక్కైన ఆ మహిళలు వారి సమస్యను అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ అనితారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మీరు మీ భూమిని అమ్ముకోవడంతో పేర్లు మారాయని ఆమె సమాధానమిచ్చారని బాధితులు తెలిపారు. దీంతో తమ సమస్యను పరిష్కరించాలని వారు జిల్లా కలెక్టర్‌కి దరఖాస్తు పెట్టుకున్నారు. వాకబు చేద్దామని సోమవారం కలెక్టరేట్‌కు జయశ్రీ, ఆమె కుమారుడు, ప్రభావతి వచ్చారు. అప్పటి వరకు కాంగ్రెస్‌ నేతలు కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, చల్లా నరసింహారెడ్డి, మాజీ మంత్రి పుష్పలీల కలెక్టరేట్‌ ఎదుట ధరణి పోర్టల్‌ రద్దు చేయాలని ధర్నా చేసి అదనపు కలెక్టర్‌ తిరుపతిరావుకు వినతిపత్రం ఇచ్చేందుకు లోపలికి వస్తున్నారు. జయశ్రీ రోదిస్తూ కనిపించడంతో రంగారెడ్డి ఏమైందని అడగ్గా ఆమె జరిగింది చెప్పింది. దీంతో ఆయన వాళ్లను అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు ఛాంబర్‌లోకి తీసుకెళ్లి సమస్యను వివరించారు. కొన్ని రోజులుగా ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులు వెంకటేశ్వర్‌రావు, శ్రీశైలం తమ భూమిని తక్కువ ధరకు అమ్మాలని డిమాండ్‌ చేస్తున్నా తాము అమ్మడం లేదన్నారు. మీరు అమ్మకపోయినా తమ పేర్లపై మార్పించుకుంటామని వారు బెదిరించారని, వాళ్లు అన్నట్లుగానే ధరణి పోర్టల్‌లో గత నెల 25 నుంచి మా పేర్ల బదులు మోహన్‌రాజు, శంకర్‌, కృష్ణారెడ్డి పేర్లు వచ్చాయన్నారు. ఈసీలో తాము అమ్మినట్లుగా లేదని తెలిపారు. తాము ఉండాలా చావాలా అంటూ తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో గొంతు కోసుకునేందుకు జయశ్రీ యత్నించడంతో అదనపు కలెక్టర్‌ కంగుతిన్నారు. ఇంతలో మహిళా పోలీసు ఆమెను నిరోధించారు. రెండు రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తిరుపతిరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు