logo

అర్ధరాత్రి రోడ్డెక్కాలంటే వణుకు

రెండు నెలలక్రితం మలక్‌పేట్‌ వద్ద అతివేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువవైద్యురాలు మరణించింది.

Published : 06 Dec 2022 02:19 IST

పోకిరీ గ్యాంగ్‌ల హల్‌చల్‌తో సామాన్యుల బెంబేలు

రహదారి మధ్య ఆకతాయి ముఠాల హల్‌చల్‌

ఈనాడు, హైదరాబాద్‌-మాదన్నపేట, న్యూస్‌టుడే: రెండు నెలలక్రితం మలక్‌పేట్‌ వద్ద అతివేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువవైద్యురాలు మరణించింది.ఇదే ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై దూసుకొచ్చిన యువకుడు ట్రాఫిక్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఎస్సైతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనల్లో నిందితులు ఎవరనేది వెల్లడించేందుకు పోలీసులు మీనమేషాలు లెక్కించారు.

ఆధిపత్యం.. లైకుల కోసం

నగర శివారు, పాతబస్తీ ప్రాంతాల్లో కొంతమంది యువకులు ‘మాయాగ్యాంగ్‌’లుగా మారి సెల్‌ఫోన్‌, చైన్‌స్నాచింగ్‌, పిక్‌పాకెటింగ్‌కు పాల్పడుతున్నారు. కళాశాలల్లో విద్యార్థుల మధ్య గొడవల్లో పాల్గొంటున్నారు. ఆధిపత్యం సాధించేందుకు కత్తులు, తల్వార్లు, మద్యం సీసాలతో దాడులకు తెగబడుతున్నారు. అర్ధరాత్రి దాటాక హోటళ్లు, పాన్‌దుకాణాల వద్ద చేరుతున్నారు. నంబరు ప్లేటు లేని కార్లు, బైక్‌లతో బీభత్సం సృష్టిస్తున్నారు. ర్యాష్‌డ్రైవింగ్‌తో దారెంట వెళ్లే ప్రయాణికులను వణికిస్తున్నారు. తాజాగా సంతోష్‌నగర్‌ ఠాణా పరిధిలో రహదారులపై కత్తులు, బీరు సీసాలతో బైక్‌లపై హల్‌చల్‌ చేస్తూ వీడియోలు తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. వాటిల్లో  లైక్‌, షేరింగ్‌ల కోసమే మైనర్లు ముఠాలుగా మారి పోటీ పడుతున్నట్టు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

తెల్లవార్లూ వీధుల్లోనే

పాతబస్తీ పలు కాలనీల్లో అధికశాతం యువకులు రాత్రయితే వీధుల్లోకి చేరతారు. మద్యం తాగుతూ వేడుకలు చేసుకుంటుంటారు. రాత్రి గస్తీలోనూ కొన్ని ఠాణాల పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ఆయా గ్యాంగ్‌లు తెల్లవార్లూ చెలరేగుతున్నాయి. చార్మినార్‌, హుస్సేనిఆలం, బహదూర్‌పుర ఠాణాల పరిధిలో దారెంట ఒంటరిగా వెళ్లే ద్విచక్ర వాహనదారులు, పాదచారులను లక్ష్యం చేసుకొని దొంగలు, పాత నేరస్థులు చోరీలకు దిగుతున్నారు. బాధితుల్లో కొద్దిమంది మాత్రమే ఠాణాల్లో ఫిర్యాదు చేస్తున్నారు.

ఇవిగో ఉదాహరణలు

* నవంబర్‌ 27న సంతోష్‌నగర్‌ రహదారిపై చేతుల్లో మందు బాటిళ్లు, బొమ్మ తుపాకులతో వాహనదారులను భయభ్రాంతులకు గురి చేసిన మాయాముఠాలోని ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. వీరంతా పాతనేరస్థులే.

* ఏప్రిల్‌లో డబీర్‌పురా, చంచల్‌గూడ రహదారులపై తెల్లవారుజామున బైక్‌ రేసింగ్‌లతో భయభ్రాంతులకు గురిచేసిన వారిలో అధికశాతం విద్యార్థులే. చాదర్‌ఘాట్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

* చంచల్‌గూడలో అర్ధరాత్రి తల్వార్లతో బర్త్‌డే కేక్‌ కోసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు