logo

బీసీ విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం: ఆర్‌.కృష్ణయ్య

బీసీ విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు.

Published : 06 Dec 2022 02:19 IST

బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ కృష్ణమోహన్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఆర్‌.కృష్ణయ్య, చిత్రంలో సంతోష్‌, గుజ్జకృష్ణ, నీల వెంకటేష్‌ తదితరులు

పంజాగుట్ట, న్యూస్‌టుడే: బీసీ విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు. బీసీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులతో కలిసి సోమవారం ఖైరతాబాద్‌లోని మంత్రి గంగుల కమలాకర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 291 బీసీ గురుకుల కళాశాలలు ఉన్నప్పటికీ ఒక్కదానికీ సొంత భవనం లేకపోవడం విచారకరమన్నారు. బీసీ సంక్షేమ శాఖకు రెండేళ్లుగా కమిషనర్‌ను నియమించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ శాఖ అవినీతిమయంగా మారిందని, బీసీ హాస్టళ్లను మంత్రి గంగుల కమలాకర్‌ ఒక్కసారైనా తనిఖీ చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. బీసీ విద్యార్థులకు ప్రతీ సంవత్సరం ఇస్తున్న రూ.5500 ఉపకారవేతనాన్ని రూ.20వేలకు పెంచాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.3300 కోట్లు తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు బీసీ కమిషన్‌ కార్యాలయానికి వెళ్లి కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌కు వినతిపత్రం అందజేశారు. బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు గుజ్జ కృష్ణ, అంజి, నీల వెంకటేష్‌, సతీష్‌, అనంతయ్య, రాజ్‌కుమార్‌, చంటి ముదిరాజ్‌, భాస్కర్‌, నిఖిల్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని