Capita Land: హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి.. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఎంవోయూ

డేటా సెంటర్‌ ఏర్పాటు సహా విస్తరణ ప్రణాళికల్లో భాగంగా తెలంగాణలో రూ.6,200 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్టు క్యాపిటల్యాండ్‌ సంస్థ తెలిపింది. పరిశ్రమలశాఖా మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొంది.

Published : 06 Dec 2022 21:13 IST

హైదరాబాద్‌: డేటా సెంటర్‌ ఏర్పాటు సహా విస్తరణ ప్రణాళికల్లో భాగంగా తెలంగాణలో రూ.6,200 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్టు క్యాపిటల్యాండ్‌ సంస్థ తెలిపింది. పరిశ్రమలశాఖా మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొంది. భారీ పెట్టుబడితో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్‌ నగరంలో ఉన్న తన కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్టు  తెలిపింది. రూ.1200 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌ మాదాపూర్‌లోని క్లైంట్‌ ఇంటర్నేషనల్‌ టెక్‌ పార్క్‌లో క్యాపిటల్యాండ్‌  ఇండియా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది.

2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం కలిగి ఉండే ఐటీపీహెచ్‌ డేటా సెంటర్‌ ఐదేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని క్యాపిటల్యాండ్‌  వివరించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తమకున్న సుమారు 6 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ విస్తీర్ణాన్ని రెట్టింపు చేసేందుకు రానున్న ఐదేళ్లలో మరో రూ.5వేల కోట్లు పెట్టుబడిగా పెట్టునున్నట్టు కంపెనీ తెలిపింది. క్యాపిటల్యాండ్‌ పెట్టుబడిని స్వాగతించిన మంత్రి కేటీఆర్‌... దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్‌ మార్కెట్లలో హైదరాబాద్‌ ఒకటని అన్నారు. మానవ భవిష్యత్తును మరింత మెరుగుపరచడంలో డేటానే కీలకపాత్ర పోషించబోతోందన్న ఆయన .. హైదరాబాద్‌లో రోజు రోజుకూ పెరుగుతున్న ఐటీ పరిశ్రమ అవసరాలు ఈ డేటా సెంటర్‌తో తీరుతాయని అభిప్రాయపడ్డారు. దీంతో పాటు ఐటీ, ఐటీ సర్వీసుల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలోనూ క్యాపిట ల్యాండ్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని కేటీఆర్‌ చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని