logo

పట్టా సృష్టించి.. విమానం ఎక్కించి

మలక్‌పేటకు చెందిన  హేమంత్‌ రికో ఓవర్సీస్‌ కన్సల్టెన్సీ, నగరానికి చెందిన కళ్యాణ్‌ వేఫోర్‌ ఓవర్సీస్‌ కన్సల్టెన్సీలు నిర్వహిస్తున్నారు.

Published : 07 Dec 2022 03:37 IST

తప్పుడు  విధానాలతో విదేశాలకు విద్యార్థులు
కన్సల్టెన్సీల  బాగోతాలపై నగర పోలీసుల దృష్టి  

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు-హైదరాబాద్‌

మలక్‌పేటకు చెందిన  హేమంత్‌ రికో ఓవర్సీస్‌ కన్సల్టెన్సీ, నగరానికి చెందిన కళ్యాణ్‌ వేఫోర్‌ ఓవర్సీస్‌ కన్సల్టెన్సీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులను ఏ కోర్సు కావాలంటే వాటి ధ్రువపత్రాలు ఇప్పిస్తామని అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలకు వెళ్లొచ్చని నమ్మించేవారు. ఆనంద్‌కుమార్‌ అనే వ్యక్తితో ఫొటోషాప్‌లో నకిలీ పట్టాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. రాచకొండ పోలీసులు ఇటీవల ముగ్గురినీ అరెస్టు చేశారు.

విదేశీవిద్య మోజులో ఉన్న విద్యార్థులను కన్సల్టెన్సీలు మోసం చేస్తున్నాయి. కొన్ని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు సృష్టిస్తుండగా మరికొందరు జీఆర్‌ఈ, టోఫెల్‌ నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసి తప్పుడు మార్గాల్లో ఉన్నత విద్యకు అమెరికాతోపాటు ఇతర దేశాలకు పంపిస్తున్నాయి. తప్పుడు పద్ధతులు అనుసరించి రూ.కోట్లు కొల్లగొడుతున్న వాటిని గుర్తించే పనిని నగర పోలీసులు మొదలుపెట్టారు.
అనుమానంతో పరిశీలన.. రాష్ట్రం నుంచి ఏటా దాదాపు లక్షమందికిపైగా విద్యార్థులు అమెరికాకు వెళ్తున్నారు. ఇదికాకుండా కెనడా, బ్రిటన్‌తోపాటు మరికొన్ని దేశాలకు మరో 70 వేల మంది వరకు వెళ్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో అధిక భాగం రాజధానికి చెందిన వారే ఉంటున్నారు. దరఖాస్తు చేసిన కోర్సులో చేరేందుకు కనీస విద్యార్హత, ముందుగా బ్యాంకు లోను సమకూర్చుకుని సంబంధిత యూనివర్సిటీ నుంచి ఐ-20 ధ్రువపత్రం పొందడమే ప్రధాన సమస్య. దీని తర్వాత అమెరికా వీసా సాధించడం కష్టంతో కూడుకున్న విషయమే. దీన్నే కన్సల్టెనీలు తమ ధనార్జనకు అవకాశంగా ఉపయోగించుకుంటున్నాయి. నకిలీ డిగ్రీ పట్టాలు, తప్పుడు బ్యాంకు డిపాజిట్‌ పత్రాలు సృష్టించి విమానం ఎక్కిస్తున్నాయి. ఈ పరిస్థితిని పసిగట్టిన అమెరికాలోని కొన్ని వర్సిటీలు పరిశీలన చేస్తే నకిలీ బాగోతాలు బయపడుతున్నాయి. ఇటీవలే దిల్లీ చాణక్యపురి ఠాణాలో 70 మంది విద్యార్థులతోపాటు కొన్ని కన్సల్టెనీలపై కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఆలస్యమైనా సరే.. తప్పు చేయొద్దు:
వేములపాటి అజయ్‌కుమార్‌, డైరెక్టర్‌, ఐఎంఎఫ్‌ఎస్‌

విదేశాలకు ఉన్నత విద్యకు వెళ్లాలనుకునే విద్యార్థులు కనీస పరిజ్ఞానం పొందాలి. సంబంధిత వర్సిటీ గ్లోబల్‌ ర్యాంక్‌ ఎంత ఉందన్న దానిపై విశ్లేషణ చేసుకోవాలి. ఆ తర్వాతే కనల్టెన్సీల సహకారం తీసుకోవాలి. ప్రతినిధులు చెప్పిన విషయాలు ఏ మేరకు నిజమని నిర్ధారించుకోవాలి. ఏడాది ఆలస్యమైనా పర్వాలేదు గాని తప్పుడు మార్గంలో విదేశాలకు వెళ్తే ఎప్పటికైనా పోలీసు స్టేషన్‌ గడప తొక్కాల్సిందే.

ఎంపిక విషయంలోనూ..

చాలా మంది విద్యార్థులు అమెరికా వెళ్లిపోవాలనుకుంటున్నారు గానీ అక్కడ విశ్వవిద్యాలయాలు, కళాశాలల పరిస్థితి ఏంటి? ఎందులో చేరితో భవిష్యత్తు ఉంటుందన్న దానిపై కసరత్తు చేయడం లేదు. అమెరికాలో దాదాపు 4,500 విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఉంటే కొన్నింట్లో స్థాయికి తగ్గ బోధన లేదు. వాటి యాజమాన్యాలు దేశంలో కొన్ని కన్సల్టెన్సీలు పెట్టుకున్నాయి. విద్యార్థులు తమ దగ్గరకు రాగానే కన్సల్టెన్సీ నిర్వాహకులు ఇలాంటి నాణ్యత లేని కళాశాలల్లో సీట్లు ఇప్పిస్తున్నాయి. ఇందుకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. చేరి ఏడాది, రెండేళ్ల చదివిన తర్వాత గాని ఈ విషయం విద్యార్థులకు తెలియడం లేదు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని