logo

పటిష్ఠ ప్రణాళికతో నగరాభివృద్ధి: కేటీఆర్‌

ఓవైపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు.. మరోవైపు ప్రజల హర్షాతిరేకాల మధ్య మంత్రి కేటీఆర్‌ పర్యటన మంగళవారం ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది.

Published : 07 Dec 2022 03:37 IST

సభలో మంత్రి మల్లారెడ్డి ‘ఈ ముక్తిఘాట్‌ చూస్తే అసూయ కలుగుతోంది. మీకు దండం పెడతా సార్‌.. మేడ్చల్‌ జిల్లాలోనూ ఇలాంటి శ్మశానవాటిక నిర్మించండి’ అని మంత్రి కేటీఆర్‌ను కోరడంతో సభలో నవ్వులు విరబూశాయి.

బండ్లగూడ, ఎల్బీనగర్‌, న్యూస్‌టుడే: ఓవైపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు.. మరోవైపు ప్రజల హర్షాతిరేకాల మధ్య మంత్రి కేటీఆర్‌ పర్యటన మంగళవారం ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. నాగోలో డివిజన్‌ ఫతుల్లాగూడలో మూడు మతాలకు సంబంధించి శ్మశానవాటిక ముక్తిఘాట్‌తోపాటు అనుసంధాన రహదారి, ఎస్‌ఎన్‌డీపీ నాలా, వనస్థలిపురంలో ఈతకొలను తదితర నిర్మాణాలను ఆయన ప్రారంభించారు. ముక్తిఘాట్‌లోని విద్యుత్తు దహన వాటికను పరిశీలించారు. అనంతరం జంతువుల అంత్యక్రియల కోసం ఏర్పాటు చేసిన దహనవాటికను ప్రారంభించి వివరాలు తెలుసుకున్నారు. నగరాభివృద్ధికి పటిష్ఠమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శివారు ప్రాంతాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సమస్య పరిష్కారంపై దృష్టిపెడతామన్నారు. ఫతుల్లాగూడలో నిర్మించిన లింకు రోడ్డుకు మూసీ మీదుగా వంతన నిర్మించి వరంగల్‌ హైవేకు అనుసంధానం చేస్తామన్నారు. తెలంగాణ రాక ముందు ఎల్బీనగర్‌ చౌరస్తా ఎలా ఉండేదో.. ఇప్పుడెలా ఉందో చూడాలని, ఇది తమ ప్రభుత్వ పనితీరుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు.

పర్యాటక కేంద్రంగా మారుస్తాం..

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆటోనగర్‌ డంపింగ్‌ యార్డులో పూలవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. తద్వారా పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. ఇదీ భవిష్యత్తు తరాల కోసం పాటుపడే నాయకుడి లక్షణమన్నారు. ఎల్బీనగర్‌లో రిజిస్ట్రేషన్‌ సమస్య పరిష్కారానికి జీవో 118 తెచ్చిన ఘనత సుధీర్‌రెడ్డిదేనని అన్నారు. ఫతుల్లాగూడ మీదుగా పీర్జాదిగూడకు వెళ్లే రోడ్డుపై త్వరలో సినిమా చిత్రీకరణలు జరుగుతాయని ఎమ్మెల్యే చెబుతుంటే సంతోషంగా ఉందన్నారు. వివిధ కార్పొరేషన్‌ ఛైర్మన్లు వై.సతీష్‌రెడ్డి, శ్రీనివాస్‌ గుప్తా, అమరవాది లక్ష్మినారాయణ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ సీఈ బీఎల్‌ఎన్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ ఈఎన్సీ జియావుద్దీన్‌, జోనల్‌ కమిషనర్‌ పంకజ తదితరులుపాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని