logo

రెచ్చిపోయిన దోపిడీ దొంగలు

సికింద్రాబాద్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.. బంగారం తీసుకెళ్తున్న కొరియర్‌బాయ్‌ను వెంబడించి కళ్లలో కారం చల్లి కత్తితో దాడికి తెగబడ్డారు.

Published : 07 Dec 2022 03:37 IST

కళ్లలో కారం చల్లి.. కత్తితో కొరియర్‌బాయ్‌పై దాడి  
రూ.27లక్షల విలువైన బంగారం దోచుకొని పరారీ

ఈనాడు, హైదరాబాద్‌, రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే

పవన్‌కుమార్‌పై దాడి చేస్తున్న దొంగలు (సీసీ కెమెరా చిత్రం)

సికింద్రాబాద్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.. బంగారం తీసుకెళ్తున్న కొరియర్‌బాయ్‌ను వెంబడించి కళ్లలో కారం చల్లి కత్తితో దాడికి తెగబడ్డారు. కిందపడగానే బాధితుడి నుంచి బంగారం దోచుకొని పారిపోయారు. సోమవారం రాత్రి సికింద్రాబాద్‌లో ఈ ఘటన జరిగింది.  మోండామార్కెట్‌ సమీపంలోని పాటుమార్కెట్‌ వద్ద శ్రీజై అంబే కొరియర్స్‌లో పనిచేస్తున్న కొరియర్‌బాయ్‌ సాయిని పవన్‌కుమార్‌ శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనంపై నగలు సేకరించేందుకు బంగారు దుకాణాలకు బయల్దేరాడు. కవాడిగూడలోని గోల్డ్‌బార్‌ జువెలరీ నుంచి రూ.8,65,000 విలువైన బంగారుకడ్డీ, హిమాయత్‌నగరలోని శ్రీ రాధే డైమండ్స్‌ దుకాణం నుంచి రూ.18,47,472 విలువైన వజ్రాల ఆభరణాలు తీసుకొని సంచిలో భద్రపరిచాడు. అనంతరం అదే ద్విచక్ర వాహనంపై కొరియర్‌ కార్యాలయానికి బయల్దేరాడు. బైబిల్‌హౌస్‌ సమీపంలోకి రాగానే ద్విచక్రవాహనంపై ఇద్దరు ఆగంతకులు.. పవన్‌కుమార్‌ కళ్లలో కారం చల్లారు. ఆందోళనకు గురైన బాధితుడు.. ద్విచక్రవాహనం వేగం పెంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. సికింద్రాబాద్‌ ఆర్పీరోడ్‌లోని సిటీలైట్‌క్రాస్‌రోడ్‌ వద్ద ముందుగా వెళ్తున్న ఆటోను ఢీకొట్టి కిందపడిపోయాడు. వెంటబడుతూ వచ్చిన ఆగంతకులు.. బాధితుడి నుంచి ఆభరణాల సంచిని లాక్కునేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటించిన బాధితుడిపై కత్తితో దాడి చేసి.. బంగారు ఆభరణాలు లాక్కొని నిందితులు పారిపోయారు. గాయపడిన అతడు ఫోన్‌ ద్వారా యజమానికి సమాచారమిచ్చాడు. జై మాతా ది లాజిస్టిక్‌ యజమాని సతీష్‌కుమార్‌ ఫిర్యాదుతో మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన పవన్‌కుమార్‌ను జూబ్లీహిల్స్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

పోలీసుల అదుపులో సహాయకుడు?

దోపిడీ దొంగల దాడితో అప్రమత్తమైన ఉత్తరమండలం డీసీపీ చందనదీప్తి, అదనపు డీసీపీ హరీష్‌గౌతమ్‌, మహంకాళి ఏసీపీ బి.రమేష్‌ ఆధ్వర్యంలో నిందితులను పట్టుకునేందుకు 7 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.నిందితులను పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌ బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా మంగళవారం సాయంత్రం దొంగతనానికి సహకరించిన యువకుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని