logo

ఆర్థిక సాయం..అభివృద్ధికి ప్రోత్సాహం

కొత్త సంఘాల ఏర్పాటుతో గ్రామాల్లో మహిళలంతా సభ్యులుగా చేరుతున్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు చేయూతనివ్వడంతో మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. ఆరు నెలల తర్వాత సంఘం పొదుపుతో బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేస్తున్నారు.

Updated : 07 Dec 2022 05:35 IST

జిల్లాలో మరో వెయ్యి సంఘాల ఏర్పాటుకు చర్యలు

కిస్తీ పద్ధతిగా చెల్లిస్తే చాలు..

న్యూస్‌టుడే, వికారాబాద్‌, పెద్దేముల్‌, వికారాబాద్‌ మున్సిపాలిటీ, తాండూరు

సభ్యుల సమావేశం

కొత్త సంఘాల ఏర్పాటుతో గ్రామాల్లో మహిళలంతా సభ్యులుగా చేరుతున్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు చేయూతనివ్వడంతో మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. ఆరు నెలల తర్వాత సంఘం పొదుపుతో బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేస్తున్నారు. అనంతరం వాయిదా పద్ధతిలో కిస్తీలు చెల్లిస్తే ఎప్పటిలా రుణం మొత్తాన్ని పెంచుతున్నారు. రూ.5 లక్షల వరకు రుణ వెసులుబాటు కల్పిస్తున్నారు. బ్యాంకు రుణాలతో పాటు పావలా వడ్డీతో స్త్రీనిధి రుణాలు పొందుతున్నారు. దీంతో మహిళా సంఘాల్లోని సభ్యులు కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. వ్యాపార రంగాల్లోనూ రాణిస్తున్నారు.

జిల్లాలో పేద, మధ్య తరగతి, గ్రామీణ మహిళల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలుచేస్తున్నాయి. స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి కుటీర, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయి. వీటిని సక్రమంగా కట్టిన వారికి రూ.10 లక్షల దాకా కూడా రుణాలిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ సంఘాల సంఖ్య మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మహిళలకు చక్కటి అవకాశంగా అధికారులు పేర్కొంటున్నారు.

పది వేల మంది సభ్యులతో...

పూర్తి గ్రామీణ నేపథ్యం కలిగిన వికారాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం 15,525 స్వయం సహాయక సంఘాలు ఉండగా, వీటిలో మొత్తంగా 1,62,683 మంది సభ్యులు ఉన్నారు. వీటికి అదనంగా 10 వేల మంది సభ్యులతో కూడిన వెయ్యి గ్రూపులను కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష గ్రూపులను ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. కొత్త సంఘాల ఏర్పాటుకు సర్వే నిర్వహించారు. ఇన్నాళ్లూ సంఘాల్లో ఎందుకు చేరలేదనే పలు అంశాలతో కూడిన వివరాలు సేకరిస్తున్నారు. గ్రామాల్లో బీఎల్‌ఓల సహకారంతో ఓటరు జాబితాను పరిశీలిస్తున్నారు. సంఘాల్లో లేని సభ్యుల వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటున్నారు.. వలస వెళ్లారా.. మరణించారా.. 18 ఏళ్లు పైబడినవారు, వివాహితులా, రెండేసి చోట్ల ఓటు ఉందా. ఉద్యోగస్తులా వంటి వివరాలను సేకరిస్తున్నారు. ఏదీ కానప్పటికీ సంఘంలో సభ్యులుగా ఎందుకు చేరలేదని ఆరా తీస్తున్నారు. ఓటర్ల జాబితా ఆధారంగా గ్రామాల వారీగా ఇంకా ఎంత మంది కొత్త సభ్యులుగా చేరుతారు. ఎన్ని సంఘాలు ఏర్పడతాయనే విషయాన్ని అధికారులు తేల్చాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని