logo

కమిటీ మాట.. వినపడదు ఏ నోటా..!

గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, పురపాలికల్లో ‘వార్డుల వారీగా కమిటీలు’ వేసింది.

Published : 08 Dec 2022 02:37 IST

గ్రామ, పురపాలికల్లో కనిపించని ప్రభావం
న్యూస్‌టుడే, వికారాబాద్‌, తాండూరు

గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, పురపాలికల్లో ‘వార్డుల వారీగా కమిటీలు’ వేసింది. సంవత్సరాలు గడుస్తున్నా వాటిని పట్టించుకునేవారు కరవయ్యారు. దీంతో స్థానికంగా వేసిన కమిటీలు ఉత్తుత్తి కమిటీలుగా పేరు పొందాయి.

గ్రామాల్లో 4528, మున్సిపాలిటీల్లో 475

సుమారు 5 సంవత్సరాల క్రితం జిల్లాలో మొత్తం 566 గ్రామ పంచాయతీల పరిధిలో 4,528 కమిటీలు, నాలుగు పురపాలికల్లోని 95 వార్డుల్లో 475 కమిటీలు వేశారు. నాటి నుంచి పల్లె, పట్టణాల్లో అధికారులు, పాలకవర్గాలు పట్టించుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ, పట్టణాభివృద్ధికి అందిస్తున్న నిధులను సక్రమంగా ఉపయోగించుకునే విధంగా కొత్త పాలకవర్గాలు రావడంతోనే ప్రభుత్వం స్థానిక కమిటీలను నియమిస్తోంది. గ్రామ పంచాయతీల్లో ప్రతి కమిటీలో సర్పంచితో పాటు గ్రామ కార్యదర్శి, ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండేలా రిజర్వేషన్లు కూడా కేటాయించారు. వీరికి ఎలాంటి గౌరవ వేతనం లేకపోయినా వీరి సూచనలు కీలకంగా ఉంటాయని భావించారు. అయితే వారిని కనీసం గ్రామ సభలకు ఆహ్వానించడం లేదు.

8 చొప్పున ...

గ్రామానికి 8 కమిటీల చొప్పున మొత్తం 4,528 కమిటీల్లో దాదాపు 67,920 మంది సభ్యులు ఉన్నారు. వీరు రైతు సంక్షేమం, పాఠశాలల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, మద్య నిషేధం, ఆహారం, గ్రామాభివృద్ధి, గ్రామీణ అక్షరాస్యత వీధి దీపాల నిర్వహణ, దేవాలయాల అభివృద్ధి తదితర వంటి వాటిపై పర్యవేక్షణ, సూచనలు చేయాల్సి ఉంటుంది. కానీ వీరిని పరిగణలోకి తీసుకోవడం లేదు.

పురపాలికల్లోనూ అదే తీరు..

పురపాలికల్లో కూడా కమిటీలపై నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ఈ నాలుగు పురపాలికల్లోని 95  వార్డుల్లో వివిధ పనుల పర్యవేక్షణ కోసం కౌన్సిలర్‌కు అనుసంధానంగా 15 మంది చొప్పున 5 కమిటీలను వేశారు. ప్రతి వార్డులో 75 మంది చొప్పున 7,125 మందిని నియమించారు. యువజన కమిటీ, మహిళా కమిటీ, సీనియర్‌ సిటిజన్‌ కమిటీ, పురజనుల కమిటీ, హరితహారం కమిటీలను వేశారు. నాలుగు పురపాలికల్లో ప్రజలకు స్వచ్ఛతకు సంబంధించిన అవగాహన కల్పించడంతో పాటు పారిశుద్ధ్యం, తడి, పొడి చెత్త సేకరణ, హరితహారం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, ఇతర అంశాల్లో వార్డు కమిటీలు కీలక పాత్ర పోషించాల్సి ఉండగా, పురపాలిక దరిదాపులకు కూడా వీరిని రానివ్వడం లేదు. ప్రభుత్వం ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని