logo

తరగతులు సరే.. అల్పాహారం ఎలా..!

పదిలో విద్యార్థులు మంచి గ్రేడ్‌ సాధించాలని విద్యాశాఖ అధికారులు డిసెంబరు 1 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

Published : 08 Dec 2022 02:37 IST

అర్ధాకలితో ‘పది’ విద్యార్థులు
న్యూస్‌టుడే, కొడంగల్‌ గ్రామీణం, బొంరాస్‌పేట, తాండూరు

దుద్యాలలో ‘ప్రత్యేక’ తరగతిలో విద్యార్థులు

పదిలో విద్యార్థులు మంచి గ్రేడ్‌ సాధించాలని విద్యాశాఖ అధికారులు డిసెంబరు 1 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. తరచూ పరీక్షలు నిర్వహిస్తూ వెనకబడిన పిల్లలపై శ్రద్ధ చూపుతున్నారు. ఇదే సమయంలో విద్యార్థులు అర్ధాకలితో అవస్థ పడాల్సి వస్తోంది. ఈ ప్రభావం చదువుపై పడుతోందని ఉపాధ్యాయులు అంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడంతోపాటు ప్రభుత్వం ప్రత్యేకంగా అల్పాహారాన్ని అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

పేదింటి వారే ఎక్కువ..

జిల్లాలోని 154 ఉన్నత పాఠశాలల్లో 2022-23 ఏడాదిలో 13,360 మంది పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతుండగా దాదాపుగా అందరూ ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నారు. వీరిలో దాదాపు 90 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద కుటుంబాల వారే కావడం గమనార్హం.

దాతలు ముందుకొస్తేనే.. 

డిసెంబరు ఒకటి నుంచి ఉదయం 8.45 నుంచి 9.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అధిక శాతం పిల్లలు ఉదయం తినకుండానే కనీసం 5 కి.మీ. దూరం నుంచి వస్తున్నారు. మధ్యాహ్న భోజనంతో సరిపుచ్చుకుంటున్నారు. ప్రత్యేక తరగతులకు ఎక్కువ సేపు ఉండాల్సి రావడంతో అర్ధాకలితో అవస్థ పడుతున్నారు.

* కరోనాకు ముందు దాతల సాయంతో అల్పాహారం అందించారు. సామాజిక సేవ కోణంలో అందే అవకాశాలు తక్కువ. ఈసారి కూడా దాతలు స్పందిస్తే విద్యార్థులకు అల్పాహారం లభించే అవకాశాలున్నాయని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అంటున్నారు. మానవతా దృక్పథంతో పాఠశాలల్లోని ఉపాధ్యాయులు కొన్నిచోట్ల విద్యార్థులకు బిస్కెట్లు, పళ్లు అందిస్తున్నారు. ఆకలితో కొన్ని పాఠశాలల్లోని విద్యార్థులు ఒక్కపూటనే తరగతులకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. 

నిధులొస్తే అమలు చేస్తాం
- రవికుమార్‌, సెక్టోరియల్‌ అధికారి, వికారాబాద్‌

పది ప్రత్యేక తరగతుల విద్యార్థులకు అల్పాహారం అందించే విషయమై ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆయా పాఠశాలల ఉపాధ్యాయులే దాతల, స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకొని అల్పాహారం అందించాలని సూచిస్తున్నాం.

అదనంగా కేటాయించాలి
-  చంద్రశేఖర్‌, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు, వికారాబాద్‌

ప్రత్యేక తరగతుల నిర్వహణకు పాలనాధికారి అదనపు నిధులు కేటాయించాలి. కరోనాకు ముందు జిల్లాలోని ఒక్కో ఉన్నత పాఠశాలకు రూ.2వేలుగా ప్రత్యేకంగా పాలనాధికారి నిధుల నుంచి కేటాయించారు. ఇప్పుడు కూడా అలాగే చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు