logo

వెళ్లొస్తానంటూ.. అనంత లోకాలకు..

ఆర్టీసీ అద్దె బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో చెల్లెలు మృతి చెందగా.. అన్నకు తీవ్రగాయాలయ్యాయి.

Published : 08 Dec 2022 02:37 IST

బస్సు ఢీకొని బాలిక మృతి, సోదరుడికి గాయాలు

అనూష

బషీరాబాద్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ అద్దె బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో చెల్లెలు మృతి చెందగా.. అన్నకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన బషీరాబాద్‌ ఠాణా పరిధిలోని నవల్గా పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం...మండలంలోని నవల్గాకు చెందిన కొత్త రాములు, అమృతమ్మ దంపతులు వ్యవసాయ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు శ్రీనివాస్‌, అనూష (11), లక్ష్మీ, శ్రీలత ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. శ్రీనివాస్‌ పదోతరగతి పూర్తి చేసి తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయ పడుతున్నాడు. బుధవారం ఉదయం కుసుమ పంటకు మందు పిచికారీ చేసేందుకు అవసరమైన పెట్రోల్‌ తీసుకురావడానికి నవల్గా సమీపంలోని బంక్‌కు   శ్రీనివాస్‌ బయలుదేరాడు. అదే సమయంలో అనూష కూడా పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమైంది. తన ద్విచక్ర వాహనం వెంట కూర్చోబెట్టుకొని అతను బయలుదేరాడు. పాఠశాల వద్దకు రాగానే చెల్లెలును దించే ప్రయత్నం చేయగా.. పెట్రోల్‌ బంక్‌ వద్దకు తాను వస్తాననడంతో వెంటతీసుకెళ్లాడు.  తాండూరు-బషీరాబాద్‌ ప్రధాన మార్గంలోని నవల్గా గేటు సమీపంలో కుడి వైపున ఉన్న బంక్‌లోకి ద్విచక్ర వాహనాన్ని మలుపుతుండగా.. వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టింది. అనూష తల భాగంలో బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.  శ్రీనివాస్‌కు కాలు, చేయికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడున్న వారు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు.

తీవ్రగాయాలైన శ్రీనివాస్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న స్థానికులు

నాలుగు గంటల పాటు రోడ్డుపైనే నిరసన

తన కూతురు మృతి చెందిందన్న విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదన్నారు.  సీఐ రాంబాబు, ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి డీఎస్పీ శేఖర్‌గౌడ్‌తో కుటుంబీకులను మాట్లాడించారు. కేసు విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, మీకు న్యాయం జరిగేలా చూస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో కుటుంబీకులు శాంతించారు. మృతదేహాన్ని తాండూరు జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి వారికి అప్పగించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్‌, కన్వీనర్‌ రజనీకాంత్‌, గ్రామ సర్పంచి లాలప్ప నిరసనలో మద్దతు తెలిపి కుటుంబానికి రూ.15లక్షల పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.

తాండూరు-బషీరాబాద్‌ ప్రధాన దారిలో  నిరసన తెలుపుతూ...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని