logo

దోమల రొద.. చలి బాధ

నగరంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఇదీ దుస్థితి. చలి పెరగడంతో తలదాచుకునేందుకు షెడ్లు లేక ఉన్నవి సరిపోక చాలామంది రోగులు, వారి సహాయకులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు.

Published : 08 Dec 2022 02:29 IST

రోగుల సహాయకులకు నరక యాతన
ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఇదీ తీరు

నిలోఫర్‌లో ఆరుబయట వణుకుతూ పడుకున్న సహాయకులు

నగరంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఇదీ దుస్థితి. చలి పెరగడంతో తలదాచుకునేందుకు షెడ్లు లేక ఉన్నవి సరిపోక చాలామంది రోగులు, వారి సహాయకులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. కటిక నేలపై చలిలో వణుకుతూ తమ వంతు వచ్చే వరకు అక్కడే కాలం గడుపుతున్నారు. ఆసుపత్రిలో రోగితోపాటు ఒకరిద్దరు లోపల ఉంటే.. మిగతా వారంతా బయట నిరీక్షిస్తున్నారు. మరికొందరికి వైద్యుల రాసిన టెస్టుల ఫలితాలు వచ్చేందుకు రెండు, మూడు రోజులు సమయం పడుతోంది. అవి వచ్చే వరకు అక్కడే నిరీక్షిస్తున్నారు.

దూరంగా సత్రం.. రోగులు ఇక్కడే

‘ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి’కి రోగుల తాకిడి ఎక్కువగా ఉంది. రోజు 600 మందిపైనే వైద్య పరీక్షలు, చికిత్సలకు వస్తుంటారు. ప్రస్తుతం సుమారు 450 మంది ఇన్‌పేషంట్లు ఉన్నారు. రోగి సహాయకులతో ఆసుపత్రి ప్రాంగణం కిక్కిరిసిపోతుంది. సుమారు వంద మంది సామర్థ్యంతో రేకుల షెడ్డు ఉంది. అయినా సరిపోక సుమారు 200 మంది సామర్థ్యంతో ఆధునిక హంగులతో సత్రం నిర్మించారు. ఇది కిలోమీటర్‌ దూరంలో ఉండటంతో ఎక్కువ మంది వెళ్లడం లేదు.

గాంధీలో పందికొక్కుల బెడద..

గాంధీలో రోగుల సహాయకులకు షెడ్లు ఉన్నా అక్కడ అపరిశుభ్రత తాండవిస్తోంది. పందికొక్కులు తిరుగుతూ పడుకున్న వారిపై దాడి చేస్తున్నాయి. ప్రధానంగా ప్రసవాలకోసం వచ్చే గర్భిణులతోపాటు వారి కుటుంబ సభ్యులంతా వస్తున్నారు. దీంతో షెడ్లలో చోటు సరిపోవడం లేదు. ‘ఓపీ ఎదురుగా ఉన్న మందుల దుకాణాలపైన కొత్తగా మరో భవనాన్ని నిర్మిస్తున్నాం.అది అందుబాటులోకి వస్తే రోగుల సహాయకులకు పడుకునేందుకు ఇబ్బందులేం ఉండవు’ అని గాంధీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు.

నిర్మాణంలో మరో భవనం

నిలోఫర్‌ ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్లుగా చేరితే వార్డులో రోగితో ఒక్కరినే అనుమతిస్తారు. ఇక్కడ వంద మంది సామర్థ్యంతో పాతభవనం ప్రాంగణంలో సత్రాన్ని నిర్మించారు. ఇటీవల దానిపై మరో అంతస్తు నిర్మిస్తుండడంతో సత్రం వైపు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. 

దిక్కు మొక్కూ లేక అక్కడే..

ఉస్మానియా ఆసుపత్రికి ఒంటరిగా వచ్చే రోగులకు ఓపీలో చికిత్స చేసి పంపించి వేస్తున్నారు. తోడెవ్వరూ లేరని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకోవడం లేదు. దీంతో రోగులు కాళ్లు, చేతులకు కట్టుతో నడవలేని నిస్సహాయ స్థితిలో ఆసుపత్రి ప్రాంగణంలోనే పడి ఉంటున్నారు.


మహబూబ్‌నగర్‌ చెందిన వెంకటమ్మ క్యాన్సర్‌ చికిత్స కోసం కొద్ది రోజుల క్రితం రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జే ఆసుపత్రిలో చేరారు. చికిత్స తర్వాత డిశ్ఛార్జి చేశారు. రేడియేషన్‌, కీమోథెరపీ కోసం ఆమెకు తేదీలు ఇచ్చారు. అంత దూరం వెళ్లి రాలేక.. చలిలోనే నిద్రిస్తున్నారు.


పోచంపల్లికు చెందిన ఈ కుటుంబం తమ చిన్నారికి ఆరోగ్యం బాగా లేకపోతే నిలోఫర్‌ వైద్యులకు చూపించేందుకు తీసుకొచ్చారు. ఓపీ ముగిసిన తర్వాత రావడంతో ఉదయం వరకు ఉండాలని వైద్యులు సూచించారు. అంతదూరం తిరిగి వెళ్లలేక చంటి పిల్లలతో నిలోఫర్‌ బయటే చలిలో గడిపారు.

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, గాంధీ ఆసుపత్రి, రెడ్‌హిల్స్‌, ఉస్మానియా ఆసుపత్రి

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు