logo

ఉద్యోగాల గడ్డగా మార్చడమే ధ్యేయం

12 ఏళ్ల తర్వాత ఫీజులు పెంచాం. ప్రభుత్వం రీఎంబర్స్‌మెంట్‌ ఇస్తున్నందున విద్యార్థులపై భారం పడదు.

Published : 08 Dec 2022 02:29 IST

12 ఏళ్ల తర్వాత ఫీజులు పెంచాం. ప్రభుత్వం రీఎంబర్స్‌మెంట్‌ ఇస్తున్నందున విద్యార్థులపై భారం పడదు.

విద్య.. పరిశోధన.. మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ) ప్రొ.డి.రవీందర్‌ తెలిపారు. విద్యార్థులు, ఆచార్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ఓయూ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు.. వివాదాస్పద నిర్ణయాలు.. ఫీజుల పెంపు.. ఇలా వివిధ అంశాలపై ‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో మాట్లాడారు.

ఈనాడు: వీసీగా ఏడాదిన్నర కాలంలో వర్సిటీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
వీసీ:
ఓయూకు ఉన్న ఘన చరిత్రను కాపాడటమే పెద్ద బాధ్యతగా భావిస్తున్నా. వచ్చే 10-15 ఏళ్లకు తగ్గట్టుగా వర్సిటీ అభివృద్ధికి 21 పాయింట్ల అజెండా తీసుకొచ్చా. ఇందులో టీచింగ్‌-లెర్నింగ్‌, పరిశోధనలు, మౌలిక వసతుల అభివృద్ధి, అవుట్‌రీచ్‌ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చా. ఇంటరాక్టివ్‌ క్లాస్‌ రూమ్స్‌ ప్రవేశపెడుతున్నాం. ఇప్పటికే యూపీఈలో రెండింటిని ఏర్పాటు చేశాం. ఓయూ అంటే ఉద్యమాల గడ్డే కాదు ఉద్యోగాల గడ్డ అనేలా తీర్చిదిద్దుతున్నాం.

ఈనాడు: మీరు తీసుకున్న చాలా నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తమైంది. కదా?
వీసీ:
అందరితో చర్చించాకే నిర్ణయాలు తీసుకున్నా. ఒప్పంద ఆచార్యులకు బాండ్‌ పేపర్‌ విషయంలో వారిని సూటిగా ఒకటి అడుగుతున్నా.. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలలో ఒప్పంద ఆచార్యులు అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారా? లేదా?.. ఒకవేళ కాకపోతే నేను దేనికైనా సిద్ధమే. ఇది ఈసీ తీసుకున్న నిర్ణయం.  
ఈనాడు: మీ నిర్ణయాలపై గవర్నర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. మెస్‌లు, హాస్టళ్ల విషయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి?
వీసీ: యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్‌లోనే క్రెడిట్స్‌ తగ్గింపుపై నిర్ణయం తీసుకున్నాం. డీన్స్‌, అధిపతులతో పది సార్లు సమావేశాలు పెట్టాం. ప్రపంచ యూనివర్సిటీలతో పోటీ పడుతూ ర్యాంకింగ్‌ల్లో ముందుండాలని తీసుకున్న నిర్ణయమిది. 2024లో న్యాక్‌కు వెళ్లాలంటే ఈ తరహా సంస్కరణలు అవసరం. హాస్టల్‌, మెస్‌ల డిపాజిట్‌ మేం కట్టమని.. హాస్టల్‌ మారమని చెప్పి వచ్చి కొందరు కావాలనే గొడవలు చేశారు.

ఈనాడు: 21 అంశాల అజెండాలో ఇంకా చాలా పనులు పెండింగులో ఉన్నాయన్న విమర్శ ఉంది?
వీసీ:
గత ఏడాదిన్నరలో అందరి సహకారంతో 60 శాతం అంశాలు పట్టాలెక్కించాం. ఓయూలోకి వాహనాలు రాకుండా రోడ్డు నిర్మించనున్నాం.

ఈనాడు: పరిశోధనలలో ఓయూ వెనుకబడింది. ర్యాంకుల్లోనూ దిగజారుతోంది?
వీసీ:
ఓయూలో పరిశోధనలు జరగడం లేదనే అపోహ ఉంది. దాన్ని తొలగించేందుకు పరిశోధనల్లో ముందున్న ఆచార్యులను ప్రోత్సహించేందుకు ‘ఉపకులపతి అవార్డు’ను దేశంలోనే తొలిసారిగా తీసుకొచ్చాం. ఇక్కడ పరిశోధనలను ల్యాబ్‌ టు ల్యాండ్‌ పేరిట సమాజానికి చేరవేస్తున్నాం. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో 2021లో 32వ ర్యాంకు ఉండగా, ఈసారి 22వ స్థానానికి చేరుకున్నాం.

ఈనాడు, హైదరాబాద్‌

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని