logo

సారూ.. పురుగులన్నం పెడుతున్నారు

సారూ మధ్యాహ్న భోజనంలో పురుగు వచ్చింది. అది చూసి అన్నం పడేశానని పాఠశాలకు రావద్దంటూ టీచర్‌ బెదిరించారు.. అంటూ నాలుగో తరగతి విద్యార్థిని బుధవారం మీర్‌పేట పోలీసులను ఆశ్రయించింది.

Published : 08 Dec 2022 02:29 IST

ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డితో మాట్లాడుతున్న చిన్నారి

బాలాపూర్‌, న్యూస్‌టుడే: సారూ మధ్యాహ్న భోజనంలో పురుగు వచ్చింది. అది చూసి అన్నం పడేశానని పాఠశాలకు రావద్దంటూ టీచర్‌ బెదిరించారు.. అంటూ నాలుగో తరగతి విద్యార్థిని బుధవారం మీర్‌పేట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట ప్రశాంతిహిల్స్‌లో నివాసం ఉంటున్న శ్రీను కుమార్తె పూజిత స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. మంగళవారం మధ్యాహ్న భోజన సమయంలో ఆమెకు వడ్డించిన అన్నంలో పురుగు రావడంతో పడేసింది. విషయం తెలుసుకున్న టీచర్‌ అన్నం తిననందుకు పాఠశాలకు రావొద్దని బెదిరించింది. దీంతో బుధవారం తల్లితో కలిసి మీర్‌పేట ఠాణాకు వెళ్లి ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డికి జరిగిన సంఘటన గురించి వివరించింది. వెంటనే ఆయన ఏఎస్‌ఐ తిరుపతయ్యను పాఠశాలకు పంపించారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా నిజంగానే కూరగాయలు బాగోలేవని, బియ్యం కూడా మట్టి పట్టి ఉన్నట్లు  గుర్తించినట్లు వివరించారు. చిన్నారులకు మంచి ఆహారాన్ని అందించాలని సూచించి వచ్చారు. ఇదే విషయంపై ప్రధానోపాధ్యాయుడు గంగాధర్‌కు ఫోన్‌ చేయగా విద్యార్థిని రెండు రోజుల నుంచి పాఠశాలకు రావడం లేదని తెలిపారు. ఎంఈఓ కృష్ణ స్పందించి గురువారం పాఠశాలకు వెళ్లి చిన్నారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని