logo

చెలో ఖతార్‌.. దేఖో సాకర్‌

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగరవాసులు ఉత్సుకత చూపిస్తున్నారు.

Published : 08 Dec 2022 02:29 IST

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి దోహాకు పెరిగిన రద్దీ

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు

ఈనాడు, హైదరాబాద్‌: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగరవాసులు ఉత్సుకత చూపిస్తున్నారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఖతార్‌ వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కప్‌ గత నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కాగా.. ఈ నెల 18 వరకు జరగనుంది. ఈ మ్యాచ్‌లు చూసేందుకు నగరం నుంచి సాకర్‌ క్రీడా ప్రియులు తరలివెళుతున్నారు. గత నెల 20 నుంచి శంషాబాద్‌-దోహా వెళ్లే విమానాలు రద్దీగా కనిపిస్తున్నాయి. సాధారణంగా దోహా వెళ్లేందుకు గతంలో రోజుకు ఒకట్రెండు విమానాలే నడిచేవి. 300 మంది వరకు తరలివెళ్లేవారు. గత కొన్ని రోజులుగా నాలుగైదు నడుస్తున్నాయి. నేరుగా దోహా వెళ్లే విమానాలతోపాటు కనెక్టింగ్‌ విమానాల్లోని సీట్లు పూర్తిగా నిండుతున్నాయని ఎయిర్‌లైన్స్‌ అధికారులు చెబుతున్నారు. 

టికెట్ల ధరలు పైపైకి..

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఖతార్‌ ఎయిర్‌వేస్‌ ప్రత్యేకంగా విమాన సర్వీసులు నడుపుతోంది. గతంలో రూ.25-30 వేల వరకు ఉన్న టికెట్‌ ధరలు ఇప్పుడు రూ.45-54 వేల మధ్య పలుకుతున్నాయి. బిజినెస్‌ క్లాస్‌ ఏకంగా రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉంది. ఇది సాధారణ ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. దోహా వెళ్లేందుకు ప్రత్యేక ప్యాకేజీలను టూరిస్ట్‌ ఆపరేటర్లు ప్రకటించి.. ప్రయాణికులను తీసుకెళుతున్నారు. రోజులు, విడిది సమయం బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని