logo

ఆక్రమణలపై చర్యలు.. ఆదాయానికి మార్గాలు

దేవాదాయశాఖ భూములపై కబ్జాదారుల కన్ను పడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Published : 08 Dec 2022 02:29 IST

దేవాదాయ భూముల రక్షణకు నడుంబిగించిన యంత్రాంగం

గిర్కపల్లి అన్నపూర్ణ ఆలయ భూముల్లోని నిర్మాణాల ధ్వంసం

ఈనాడు, హైదరాబాద్‌: దేవాదాయశాఖ భూములపై కబ్జాదారుల కన్ను పడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భూముల్లో సర్వేలు చేపట్టి.. హద్దులు నిర్ణయించడంతోపాటు అభివృద్ధి పనులు చేపట్టి ఆదాయాన్ని ఆర్జించే ప్రణాళికలు రచిస్తున్నారు. నిర్మాణాల ద్వారా అద్దె, భూముల లీజులతో ఆదాయం సమకూర్చుకోవాలనేది ఆలోచన. వివాదాలు వస్తే ట్రైబ్యునల్‌ ఎవిక్షన్‌ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నారు.

* పాత రామంతాపూర్‌ సమీపంలోని మల్లికార్జున స్వామి దేవాలయం పరిధిలో శ్రీరామకాలనీ, భగాయత్‌లో సర్వే నం.1, 91/1, 91/2ల్లో 1.45 ఎకరాల స్థలం ఉంది. పశుగ్రాసం వేసి వేలం ద్వారా రైతులకు అందిస్తూ దేవాదాయశాఖ ఆదాయం ఆర్జిస్తోంది. ఇక్కడ గజం విలువ రూ.60 వేలకు పైనే. దేవాదాయశాఖ భూమి మినహా హద్దులు నిర్ణయించకపోవడంతో, 1125 గజాల స్థలం కబ్జాకు గురైంది. విషయం దేవాదాయ కమిషనర్‌ దృష్టికి వెళ్లడంతో ఆ స్థలాన్ని పరిశీలించి, హద్దుల్ని నిర్ణయించాలని ఆదేశించారు. 1.12 ఎకరాల్లో కల్యాణమండపం, మిగతా స్థలంలో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

* కార్వాన్‌ మూసీ తీరంలోని గిర్కపల్లిలో అన్నపూర్ణ దేవాలయం వద్ద 8 ఎకరాల దేవాలయ భూములున్నాయి. కొంత స్థలాన్ని ఆక్రమించారు. మూడుసార్లు గుట్టుచప్పుడు కాకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దేవాదాయశాఖ దృష్టికి వెళ్లడంతో జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసింది. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఆక్రమణలను తొలగించారు.

* కూకట్‌పల్లి వైజంక్షన్‌ సమీపంలోని 540 ఎకరాల స్థలాన్ని ఓ యూనివర్సిటీకి అప్పగించేందుకు దేవాదాయశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. లీజు లేదా అద్దె ప్రాతిపదికన అప్పగించడం ద్వారా ఆ శాఖకు 21 శాతం మేర ఆదాయం సమకూరనుంది. 

ఎండోమెంట్‌ ట్రైబ్యునల్‌ ఎవిక్షన్‌ ఆర్డర్ల ప్రకారం.. పోలీసు, రెవెన్యూ విభాగాల సాయంతో ఆక్రమణలు తొలగిస్తోంది. 522 వివాదాలకు సంబంధించి ట్రైబ్యునల్‌ ఎవిక్షన్‌ ఆర్డర్లు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని