logo

పెళ్లి ప్రస్తావనపై వాగ్వాదం.. స్నేహితుడి గొంతు కోసిన యువతి

ఓ యువతి, ఓ యువకుడు.. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా నగరానికి వచ్చారు. ఓ టీ స్టాల్‌ వద్ద పరిచయం ఏర్పడింది. రోజూ అక్కడే కలుసుకునేవాళ్లు. ఆ కలయిక చివరికి హింసకి దారితీసింది.

Published : 08 Dec 2022 02:29 IST

గాయంతో అశోక్‌

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: ఓ యువతి, ఓ యువకుడు.. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా నగరానికి వచ్చారు. ఓ టీ స్టాల్‌ వద్ద పరిచయం ఏర్పడింది. రోజూ అక్కడే కలుసుకునేవాళ్లు. ఆ కలయిక చివరికి హింసకి దారితీసింది. యువతి పథకం ప్రకారం యువకుడి గొంతు కోసే క్రమంలో చెంప కింద తీవ్ర గాయమైంది. ఈ ఘటన కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో రెండు రోజుల కిందట చోటుచేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన లక్ష్మీ సౌమ్య(23) బీబీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం కేపీహెచ్‌బీకి వచ్చి నాలుగో రోడ్డులోని ఓ ప్రైవేటు వసతిగృహంలో చేరింది. ఇక్కడికి సమీపంలోనే గుంటూరుకు చెందిన అశోక్‌కుమార్‌ మరో ప్రైవేటు వసతిగృహంలో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. వీరిద్దరికి అదే రోడ్డులోని ఓ టీ స్టాల్‌ వద్ద పరిచయం ఏర్పడింది. అలా 6 నెలల పరిచయంతో అశోక్‌ పెళ్లి చేసుకుంటానని సౌమ్యతో ప్రస్తావించాడు. ఆమె మనసులో ఏముందో తెలియదు గానీ అశోక్‌తో ప్రేమగా ఉంటున్నట్లు నటించేది. వసతిగృహంలో గొడవలు పెట్టుకోవడంతో నిర్వాహకులు ఆమెను ఖాళీ చేయించారు. తొమ్మిదోఫేజ్‌లోని మరో హాస్టల్‌కు మారింది. అశోక్‌ ఆమె ఖర్చులు భరిస్తూ తరచూ పెళ్లి ప్రతిపాదనలు తెస్తునాడు. ఈనెల 5న అశోక్‌ పుట్టినరోజు కావడంతో ఇద్దరూ రాత్రి 7 గంటల ప్రాంతంలో టీ స్టాల్‌ వద్ద కలిశారు. పెళ్లి ప్రస్తావన తేవడంతో మాటమాట పెరిగింది. అప్పటికే బ్లేడు(మినీ కట్టర్‌)తో వచ్చిన సౌమ్య అశోక్‌ గొంతుపై దాడి చేయబోయింది. తప్పించుకోవడంతో మెడపై, చెంప కింద లోతుగా కోసుకుపోయింది. వెంటనే అతన్ని అదే రోడ్డులోని ఓ ఆసుపత్రికి తరలించగా, 50 కుట్లు పడ్డాయి. యువకుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని