logo

మార్కెట్లలో చెత్తతో ఇంధనం

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 3 హోల్‌సేల్‌ మార్కెట్లు, 11 రైతు బజార్లున్నాయి. ఈ మార్కెట్లలో చెత్త ఒకప్పటి ప్రధాన సమస్య. ఇప్పుడు రోజులు మారాయి.

Published : 09 Dec 2022 04:43 IST

ఈనాడు - హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 3 హోల్‌సేల్‌ మార్కెట్లు, 11 రైతు బజార్లున్నాయి. ఈ మార్కెట్లలో చెత్త ఒకప్పటి ప్రధాన సమస్య. ఇప్పుడు రోజులు మారాయి. బోయిన్‌పల్లి హోల్‌సేల్‌మార్కెట్‌తో మొదలైన చెత్తతో ఇంధన తయారీ ప్రస్థానం ఇప్పుడు బాటసింగారం, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి రైతుబజార్లు, గుడిమల్కాపూర్‌ హోల్‌సేల్‌ మార్కెట్ల వరకూ విస్తరించింది. చెత్తను ఎత్తడానికి వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ప్రతి నెలా రూ.40లక్షలు ఖర్చుచేస్తుంటే.. ఇప్పుడా ఆ మొత్తం ఆదా చేసే పనిలో పడింది.
ఐఐసీటీ సహకారంతో..  సీఎస్‌ఐఆర్‌ - ఐఐసీటీ(కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ - ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ) సాంకేతిక సహకారంతో నగరంలోని మార్కెట్లలో బయోగ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటు జరుగుతోంది. ఇటీవల గుడిమల్కాపూర్‌ కూరగాయల మార్కెట్‌లో బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. రోజుకు 5టన్నుల చెత్తను బయోగ్యాస్‌గా మార్చే సామర్థ్యం ఉంది. బాటసింగారం ప్లాంట్‌ ద్వారా రోజూ 500 కేజీల చెత్తను బయోగ్యాస్‌గా మార్చగలరు. ఇలా ఇప్పటివరకూ 871 కేజీల గ్యాస్‌ ఉత్పత్తిచేశారు. దీనిని అక్కడే క్యాంటీన్‌కు సరఫరా చేస్తున్నారు. గ్యాస్‌ ఉత్పత్తి తర్వాత మిగిలిన చెత్తను సేంద్రీయ ఎరువుగా వినియోగిస్తున్నారు.

తర్వాత దశలో రైతుబజార్లు..

మొదటిసారి మెహిదీపట్నం రైతుబజారులో చెత్తతో సేంద్రియ ఎరువు తయారీ యూనిట్‌ నెలకొల్పారు. రెండేళ్లు బాగా పనిచేసినా.. తర్వాత కుంటుపడింది. ఇప్పుడీ యూనిట్‌ను తెరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎర్రగడ్డ మోడల్‌ రైతుబజారులో ఇప్పటికే బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. కూకట్‌పల్లి మోడల్‌ రైతుబజారులో బయోగ్యాస్‌ ప్లాంట్‌ నడుస్తోంది. తర్వాత దశలో మిగిలిన రైతుబజార్లన్నిటిలో బయోగ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటుకు వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ సిద్ధమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని