logo

సీలింగ్‌ భూమి.. సమర్పయామి

అక్కడ వారికి భూమే లేదు.. ఉందని నకిలీ పత్రాలు సృష్టించారు. ఏకంగా సర్వే నంబరులో అదనంగా భూమిని సృష్టించి విక్రయించేశారు. మహేశ్వరం మండలం మన్‌సాన్‌పల్లిలో భూబాగోతమిది.

Updated : 09 Dec 2022 05:10 IST

నకిలీ పత్రాలు సృష్టించి విక్రయం

సీలింగ్‌ భూమిగా మన్‌సాన్‌పల్లివాసులు పెట్టిన బోర్డు

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, మహేశ్వరం: అక్కడ వారికి భూమే లేదు.. ఉందని నకిలీ పత్రాలు సృష్టించారు. ఏకంగా సర్వే నంబరులో అదనంగా భూమిని సృష్టించి విక్రయించేశారు. మహేశ్వరం మండలం మన్‌సాన్‌పల్లిలో భూబాగోతమిది. ఈ భూమి విలువ మార్కెట్‌లో ఏకంగా రూ.160 కోట్లు .

1975లో సీలింగ్‌ ప్రకటన.. మన్‌సాన్‌పల్లిలోని సర్వే నం.172/1, 177-180లో 38.22 ఎకరాలు రెవెన్యూ రికార్డుల ప్రకారం సీలింగ్‌ భూమిగా నమోదైంది. 172/1లోని 4.04 ఎకరాలను నలుగురికి ప్రభుత్వం అసైన్‌ చేయగా.. రికార్డుల ప్రకారం 1994-95 నుంచి వారి పేర్లతోపాటు సీలింగ్‌ పట్టాగా కొనసాగుతోంది. 2007-08 నుంచి లక్ష్మణ్‌, భన్య పేర్లను రికార్డుల్లోకి ఎక్కించి 3.03 ఎకరాలకు పట్టాదారులుగా చేర్చి తారుమారు చేశారు. సర్వే నం.172లో 6.23 ఎకరాలకుగాను ఏకంగా 9.26 ఎకరాలు ఉన్నట్లుగా రికార్డులు మార్చివేశారు. అదనంగా చేర్చిన 3.03 ఎకరాలకు అక్రమార్కులు నకిలీ పత్రం సృష్టించారు. ఎక్కువగా చూపిన భూమికి గతేడాది డిసెంబరులో ధరణిలో స్లాట్‌ తీసుకున్నారు. లక్ష్మణ్‌, భన్యా భూమి ఉందని భావించి పల్లె గోపాల్‌గౌడ్‌కు విక్రయించారు. ఆ సమయంలో ధరణి పోర్టల్‌తో అక్రమార్కులు దరఖాస్తులు సమర్పించి 3.03 ఎకరాలను విక్రయించేశారు. ఈ వ్యవహారంలో స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు చక్రం తిప్పి భారీగా ఆర్జించినట్లు తెలిసింది.

రద్దుకు నివేదిక.. పోలీసు కేసు.. ఈ విషయం గతంలో మహేశ్వరంలో పనిచేసిన తహసీల్దారు జ్యోతి దృష్టికి వెళ్లడంతో ధరణిలో రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌కు రద్దు నివేదిక సమర్పించారు. ఈ వ్యవహారంపై మహేశ్వరం ఠాణాలో ఏప్రిల్‌ 11న కేసు కూడా నమోదైనా పురగోతి లేదు. అక్రమార్కులు కొంత మేర భూమిని తమదిగా చూపించి... మిగిలిన భూమిమొత్తం కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానికులు సీలింగ్‌ భూమిగా సూచిస్తూ బోర్డు ఏర్పాటుచేశారు. ఈ వ్యవహారంపై తహసీల్దారు మహమూదర్‌ అలీ మాట్లాడుతూ.. ఇటీవలే మహేశ్వరం మండలానికి వచ్చానని, సంబంధిత దస్త్రం పరిశీలించి తదుపరి చర్యలకు పంపిస్తానని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు