logo

చీకటి వ్యాపారం.. హోటళ్ల సహకారం

ఇటీవల వెలుగుచూసిన అంతర్జాతీయ వ్యభిచార ముఠా కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న సైబరాబాద్‌ పోలీసులకు, నగరంలోని కొన్ని ప్రముఖ స్టార్‌ హోటళ్ల పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నాయి.

Published : 09 Dec 2022 04:43 IST

అంతర్జాతీయ వ్యభిచార ముఠా కేసులో పోలీసుల దూకుడు
కొన్నింటి సిబ్బందికి సంబంధాలున్నట్లు గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవల వెలుగుచూసిన అంతర్జాతీయ వ్యభిచార ముఠా కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న సైబరాబాద్‌ పోలీసులకు, నగరంలోని కొన్ని ప్రముఖ స్టార్‌ హోటళ్ల పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా హోటళ్ల సిబ్బంది వ్యవహారంపై దృష్టిసారించారు. ప్రముఖ హోటళ్లలో పనిచేసే కొందరు కమీషన్లు తీసుకుని ఈ చీకటి వ్యాపారానికి సహకరించారు. నిందితులు తమ వ్యాపారానికి గదులు అవసరమైనప్పుడు విటుల స్థాయిని బట్టి హోటల్‌ గదులు బుక్‌ చేసేవారు. దాదాపు 70శాతం ఓయో హోటల్స్‌ కాగా.. ఎంతైనా ఇచ్చేవారి కోసం స్టార్‌ హోటళ్లలో బుక్‌ చేశారు. ఇందుకు సిబ్బంది సహకరించి కమీషన్లు తీసుకున్నారు. నిందితుల ఫోన్లలోని డేటాను విశ్లేషిస్తున్న నేపథ్యంలో  మరికొందర్ని కేసులో నిందితులుగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. కొన్ని హోటళ్లకు నోటీసులు ఇచ్చే అవకాశముందని సమాచారం.

14 వేల మంది గుట్టు విప్పిన టీఎస్‌పీసీసీ

కేసులో అరెస్టయిన 18మంది రష్యా, థాయిలాండ్‌, ఉజ్బెకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ సహా దేశంలోని 15 నగరాలకు చెందిన 14,190మంది యువతుల్ని వ్యభిచార కూపంలోకి నెట్టారు. ఈ వివరాలు రాబట్టడంలో సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ సైబర్‌సేఫ్టీ(టీఎస్‌పీసీసీ) కీలకంగా వ్యవహరించింది. నిందితుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకొని ఇక్కడి నిపుణుల ద్వారా విశ్లేషించారు. ఫోన్‌ సంభాషణలు, చాటింగ్‌ చేసిన  వేలాది విటుల వివరాలూ దొరికాయి.

బాధితులకు కొత్త జీవితం.. వ్యభిచారంలోకి దింపిన యువతుల ఫొటోల్ని నిందితులు ఏడు వెబ్‌సైట్లలో  ఉంచినట్లు వెల్లడైంది. వీటన్నింటినీ ఇతర దేశాల నుంచి నిర్వహిస్తున్నారు. నిందితులతో పాటు చిక్కిన 39 మంది యువతులకు పునరావాసంతో కొత్త జీవితం కల్పించాలని నిర్ణయించారు. ఇందుకు అధికారులు ఓ స్వచ్ఛంద సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారు.

రంగంలోకి సీసీఎస్‌ బృందాలు..అరెస్టయిన 18మంది వెనుక ఎవరున్నారనే కోణంలో ఆరాతీస్తున్నారు. సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌) పోలీసుల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. యువతుల సరఫరాలో విదేశీ మధ్యవర్తుల ప్రమేయం వెలుగుచూసింది. వారి పాత్రను బలపరిచే ఆధారాలు సేకరించడంపై అధికారులు దృష్టిపెట్టారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు