logo

ఆధార్‌ అనుసంధానం 59 శాతం పూర్తి

జిల్లాలో బోగస్‌ కార్డులను, ఒకరికే రెండు చోట్ల ఓటు ఉన్నట్లు చూపించే కార్డులను గుర్తించి తొలగించేందుకు ఆధార్‌ అనుసంధానం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆగస్టు ఒకటిన చేపట్టింది.

Published : 09 Dec 2022 04:58 IST

గోడ పత్రికను ఆవిష్కరిస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ, పరిగి: జిల్లాలో బోగస్‌ కార్డులను, ఒకరికే రెండు చోట్ల ఓటు ఉన్నట్లు చూపించే కార్డులను గుర్తించి తొలగించేందుకు ఆధార్‌ అనుసంధానం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆగస్టు ఒకటిన చేపట్టింది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 1130 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 59 శాతం ఓటరు కార్డులకు అనుసంధానం చేశారు. ఈనెల చివర్లోగా అనుసంధాన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.  

మొత్తం 8,70,202 మంది ఓటర్లు

వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ నియోజక వర్గాల్లో 8,70,202 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో ఈనెల 6 వరకు 5,14,575 మంది ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. 3,55,627 మంది చేసుకోవాల్సి ఉంది. బూత్‌ స్థాయి అధికారులు అనుసంధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని, మరణించిన వారిని గుర్తించి తొలగించారు. కొందరు ఆధార్‌ అనుసంధానం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. జిల్లాకు చెందిన కొన్ని కుటుంబాలు హైదరాబాద్‌ సమీపంలోని లింగంపల్లి, మియాపూర్‌, ఆరె మైసమ్మ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పర్చుకున్నారు. ఇలాంటి వారి ఓటు అటు వికారాబాద్‌లో ఇటు హైదరాబాద్‌లో ఉంటోంది. వీరి అనుసంధాన ప్రక్రియ కొంత ఇబ్బందిగా మారింది.

ఇంటింటా తిరుగుతూ..: ఆధార్‌ అనుసంధానం కోసం పోలింగ్‌ స్టేషన్ల వారిగా ఇంటింటా తిరుగుతూ అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, మెప్మా ఆర్పీలు, సర్వే నిర్వహిస్తున్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వేర్వేరుగా సిబ్బందిని నియమించి నమోదు చేస్తున్నారు. నాలుగు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. గత సెప్టెంబర్‌ వరకు 50 శాతం అనుసంధానం చేశారు. ఆ తర్వాత రెండు నెలల్లో కేవలం 9 శాతం మాత్రమే జరిగింది. బంట్వారం మండలంలో అత్యధికంగా 81.89 శాతం నమోదు చేయగా వికారాబాద్‌ మండలంలో అత్యల్పంగా 35.81 శాతం నమోదు చేశారు.

ఎందుకంటే...: ఓటరు కార్డుతో ఆధార్‌ను అనుసంధానించడం ద్వారా బోగస్‌ ఓట్లకు అడ్టుకట్ట వేయవచ్చని ఎన్నికల సంఘం భావించింది. ఈ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందం కావడంతో చాలా మంది ఆసక్తిని చూపించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.  


గడువులోగా వంద శాతం పూర్తి చేస్తాం
రవీందర్‌ దత్తు, ఎలక్షన్‌ సెల్‌ ఇన్‌ఛార్జి

నిర్ణీత గడువులోగా జిల్లాలో 100 శాతం ఆధార్‌ అనుసంధాన ప్రకియ పూర్తిచేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరు సహకరించాలి. రెండు కార్డులుంటే ఒకటి తొలగించుకోవాలి. ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు