logo

భూ వివాదం.. బాధితుల ఆత్మహత్యాయత్నం

యాలాల మండలం ఎమ్మార్వో కార్యాలయంలో లక్ష్మీనారాయణపూర్‌ గ్రామానికి చెందిన వెంకటమ్మ, ఆమె మరిది అరవింద్‌లు భూ వివాదం విషయమై పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

Updated : 09 Dec 2022 05:30 IST

యాలాల, న్యూస్‌టుడే: యాలాల మండలం ఎమ్మార్వో కార్యాలయంలో లక్ష్మీనారాయణపూర్‌ గ్రామానికి చెందిన వెంకటమ్మ, ఆమె మరిది అరవింద్‌లు భూ వివాదం విషయమై పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిని అక్కడున్న స్థానికులు అడ్డుకున్నారు. బాధితులు తెలిపిన ప్రకారం.. లక్ష్మీనారాయణపూర్‌లో 3.12 గుంటల భూమికి సంబంధించి తాండూరుకు చెందిన పవన్‌కుమార్‌ సోని (మార్వాడి) గురువారం డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నాడని తెలిసింది. దీంతో అదే గ్రామానికి చెందిన డప్పు వెంకటమ్మ, అరవింద్‌లు ఎమ్మార్వో కార్యాలయంలో ఆందోళనకు దిగారు.  

నకిలీ పత్రాలు సృష్టించి...

తాండూరుకు చెందిన కరీమ్‌ఖాన్‌ నుంచి 1988లో లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన కుర్వ సత్యమ్మ, కుర్వ రాములు 3.12గుంటల భూమిని తాండూరు సబ్‌రిజిస్ట్రార్‌ పరిధిలో కొనుగోలు చేశారు. అదే భూమిని 2000 సంవత్సరంలో వారినుంచి డప్పు వెంకటమ్మ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమే సాగుచేస్తోంది. కానీ కరీమ్‌ఖాన్‌ నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూమిని పవన్‌కుమార్‌ సోనికి 1998లోనే రిజిస్ట్రేషన్‌ చేశాడు. దీంతో వెంకటమ్మ, అరవింద్‌లు వెంటనే తాండూరు సివిల్‌ కోర్టుకు వెళ్లారు. అక్కడ పవన్‌కుమార్‌కు 2011లో అనుకూల తీర్పు రావడంతో మళ్లీ బాధితులు 2022లో హైకోర్టును ఆశ్రయించారు.  పవన్‌ కుమార్‌ తనకున్న పలుకుబడితో తాజాగా రిజిస్ట్రేషన్‌ (డబుల్‌) చేసుకోవడానికి ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారని బాధితులు వాపోయారు. వివాదం హైకోర్టులో నడుస్తున్నందున రిజిస్ట్రేషన్‌ నిలిపివేయాలని బాధితులు ఎమ్మార్వో గోవిందమ్మను కోరారు.

* ఈ విషయమై ఎమ్మార్వో గోవిందమ్మ మాట్లాడుతూ.. డబుల్‌ రిజిస్ట్రేషన్‌ మాట వాస్తవమేనని, హైకోర్టు ఉత్తర్వులతో రిజిస్ట్రేషన్‌ నిలిపివేశామని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏ పనులు చేయమని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని