logo

భగీరథ.. ఏళ్లుగా అసంపూర్తే..

ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు సరఫరా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్‌ భగీరథ పథకం తాండూరు నియోజకవర్గంలో అభాసుపాలవుతోంది.

Published : 09 Dec 2022 04:58 IST

నేటికీ పంచాయతీ బోర్లే దిక్కు

గౌడ్స్‌ కాలనీలో గోడలకు కట్టి వదిలేసిన గొట్టాలు

న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ: ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు సరఫరా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్‌ భగీరథ పథకం తాండూరు నియోజకవర్గంలో అభాసుపాలవుతోంది. ఏళ్లుగా పనులు అసంపూర్తిగా ఉన్నా అధికారులు స్పందించడంలేదనే విమర్శలున్నాయి.  

రూ.25.06 కోట్లు వ్యయం: తాండూరు మండలం 46 గ్రామాల్లో మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ కృష్ణా జలాలను సరఫరా చేసేందుకు సంకల్పించింది. 300 కిలో మీటర్ల దూరం నుంచి తాగునీరందించే పథకానికి ఏకంగా రూ.25.06కోట్లు ఖర్చు చేసింది. ఇంత చేసినా ఐదు సంవత్సరాలుగా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. తాండూరు మండలం కరణ్‌కోటలో ఐదున్నర వేల కుటుంబాలకు నల్లా గొట్టాల్ని అమర్చాల్సి ఉండగా పూర్తి చేయలేదు. కొన్నిచోట్ల నల్లా గొట్టాలను ఇంటి వాకిట్లో వేసి ఆన్‌ఆఫ్‌ సదుపాయం ఉన్న గొట్టాల్ని అమర్చలేదు. మరికొన్నిచోట్ల నీలి రంగు గొట్టాలు బిగించి వదిలేశారు. ఇంకొన్ని ఇళ్ల వద్ద గొట్టాల్ని అమర్చినా చుక్క నీరు రావడం లేదు. దీంతో నల్లా గొట్టాలు అలంకార ప్రాయంగా మారాయి.

పదేళ్లు గుత్తేదారులదే బాధ్యత: మిషన్‌ భగీరథ ట్యాంకులు, సంపులు నిర్మించిన, గ్రామాలు, ఇంటింటికీ గొట్టాలను అమర్చిన గుత్తేదారులకు ప్రభుత్వం పది సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతల్ని సైతం కట్టబెట్టింది. క్షేత్రస్థాయిలో తాగునీరు సరఫరా కాకున్నా, అసంపూర్తి గొట్టాలున్నప్పటికీ గుత్తేదారులు జాడలేకుండా పోయారు. ః కేవలం భగీరథ నీటి వినియోగం నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌లోని ఒక్క గ్రామంలోనూ లేదు. అన్ని గ్రామాల్లోనూ పంచాయతీ బోరు బావులనే వినియోగిస్తున్నారు.  


పరిశీలించి చర్యలు చేపడతాం
రమేష్‌, డీఈ, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం, తాండూరు

మిషన్‌ భగీరథ నీరు అన్ని గ్రామాలకు సరఫరా జరుగుతోంది. కొన్ని వీధులకు మాత్రం అందడం లేదు. కరణ్‌కోట, ఖాంజాపూర్‌లో పనులు పూర్తి చేయించాల్సి ఉంది. గొట్టాలను సిద్ధంగా ఉంచాం. త్వరలో ఏఈతో కలిసి గ్రామాల్ని సందర్శిస్తాం. ఎక్కడైతే నీరు రావడం లేదో గుర్తించి సరఫరా జరిగేలా చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని