logo

నిమ్స్‌కు నీరెత్తినట్లు

ఇంత మంది ఉన్నా పంజాగుట్ట నిమ్స్‌ ఆసుపత్రి పాలనను పట్టించుకునే నాథుడు లేక నిత్యం చికిత్సకు వచ్చే మూడువేల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 09 Dec 2022 05:05 IST

ఆసుపత్రికి వస్తే గంటలకొద్దీ నిరీక్షించాల్సిందే
రోగుల ఇబ్బందులు పట్టించుకునే నాథుడు కరవు
ఈనాడు, సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు, హైదరాబాద్‌

ఇంత మంది ఉన్నా పంజాగుట్ట నిమ్స్‌ ఆసుపత్రి పాలనను పట్టించుకునే నాథుడు లేక నిత్యం చికిత్సకు వచ్చే మూడువేల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేదల కార్పొరేట్‌ ఆసుపత్రిగా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న నిమ్స్‌లో వైద్య సేవలు రోజు రోజుకూ నాసిరకంగా మారుతున్నాయి. అనారోగ్య కారణాల వల్ల ఆస్పత్రి డైరెక్టర్‌ రోగుల సేవలపై దృష్టిసారించడం లేదు. ఆయన సెలవు మీద ఉండటంతో పూర్తి అధికారాలు లేని ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ దిక్కులు చూడాల్సి వస్తోంది. దీనికితోడు పాలనా విభాగంలో కీలకమైన పర్యవేక్షకులుగా వ్యవహరించే అధికారులను 18 ఏళ్లుగా నియమించలేదు.

సమస్య ఏంటంటే..

సరిపడా కౌంటర్లు లేక ఓపీ కార్డు తీసుకోవడానికి కొన్నిసార్లు నాలుగైదు గంటలు పడుతోంది. సంబంధిత వైద్యుల వద్దకు రోగులు వెళ్లి చూపించుకోవాలంటే మరో నాలుగైదు గంటలు పడుతోంది. తర్వాత పరీక్షలు చేయించుకోవడానికి సాయంత్రం వరకు ఉండాల్సి వస్తోంది. దీనికి కారణం పాలనాపరంగా సరైన పర్యవేక్షణ నిర్ణయాలు లేకపోవడమేనని వైద్యులు చెబుతున్నారు. వైద్య సేవల పరంగా రోగులకు ఎక్కడ సమస్యలు ఏర్పడుతున్నాయి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై డైరెక్టర్‌ స్థాయిలో ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. నిమ్స్‌లో అదే కొరవడింది. సిబ్బంది విధుల్లో ఉన్నారా.. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా అని ఆరా తీసే పరిస్థితి లేదని రోగులు ఆరోపిస్తున్నారు.

18 ఏళ్లుగా నియామకాల్లేవు

పాలన విభాగంలో 18 ఏళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతోనే పాలన సాఫీగా సాగడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. సహాయ మెడికల్‌ అధికారులు అయిదుగురు ఉండాల్సిన చోట ఒక్కరూ లేరు. డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌లు పదిమంది ఉండాలి. ఇద్దరే ఉన్నారు. రోగులకు చికిత్స చేయాల్సిన సీనియర్‌ వైద్యులను పాలనా పరంగా ఇన్‌ఛార్జిలుగా నియమిస్తున్నారు. ఈ రకంగానూ రోగుల సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్లు, ఆర్‌ఎంవోలుగా పూర్తిస్థాయి అధికారులు లేక ఆ బాధ్యతలను వైద్యులకు అప్పగించాల్సి వచ్చింది. మెడికల్‌ స్టోర్స్‌ ఇన్‌ఛార్జిలూ లేరు. 500 పడకలు 1500 అయినా సిబ్బందిని పెంచలేదు.

రోజువారీ పర్యటనలేవీ

ప్రస్తుత డైరెక్టర్‌ మనోహర్‌ కొద్దినెలల కిందట గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్నారు. సెలవు పెడితే మరో వైద్యునికి ఇన్‌ఛార్జి బాధ్యత అప్పగించారు. గతంలో ఈ ఆస్పత్రి ప్రాధాన్యం దృష్ట్యా డైరెక్టర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించేవారు. సంబంధిత అధికారి ఆస్పత్రి అంతా రోజూ తిరిగి సమస్యల పరిష్కారం మీద దృష్టిపెట్టేవారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని డైరెక్టర్‌గా నియమించాలని రోగులు కోరుతున్నారు.

విభాగాలు.. 34
వైద్యులు.. 600
నర్సులు.. 800
వైద్య సిబ్బంది.. 3000

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు