logo

రాష్ట్రపతి విడిదికి బొల్లారం నిలయం ముస్తాబు

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వద్ద సందడి మొదలైంది. ఈనెల 28-30 వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ఖరారైన విషయం తెలిసిందే.

Published : 10 Dec 2022 03:25 IST

ఈనెల 28 నుంచి ద్రౌపది ముర్ము పర్యటన

బొల్లారం, న్యూస్‌టుడే: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వద్ద సందడి మొదలైంది. ఈనెల 28-30 వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ఖరారైన విషయం తెలిసిందే. ఆమె బస నేపథ్యంలో రాష్ట్రపతి నిలయంలోని పరిసరాలు, భవనాలను ముస్తాబు చేస్తున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షణలో హోం, రోడ్లు, భవనాలు, జీహెచ్‌ఎంసీ, జలమండలి, అటవీ, మార్కెటు, విద్యుత్తు తదితర 25 శాఖల సిబ్బందితోపాటు కంటోన్మెంట్‌ బోర్డు, రక్షణశాఖ అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు.

* హకీంపేట-బొల్లారం చెక్‌పోస్టు- నిలయం మార్గాన్ని, లోతుకుంట మీదుగా ఉండే రాష్ట్రపతి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఆయా మార్గాల్లో వీధిదీపాలతోపాటు, నిలయం పరిసరాల్లో ఫ్లడ్‌ లైట్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. నిలయంలో పాములు, కోతులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఇప్పటికే చాలా పాములు పట్టుకున్నారు. రెండేళ్ల నుంచి రాష్ట్రపతి పర్యటన లేకపోవడంతో పొదలు పెరిగాయి.  వర్షాల వల్ల  తోటల్లో పిచ్చిమొక్కలు పెరిగాయి.  కోతుల బెడదా అధికంగా ఉంది. ఈ రెండు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సిబ్బంది నిరంతరం ప్రస్తుతం నిలయంలో పనిచేస్తున్నారు.

ముర్ముకు ఇది తొలి విడిది

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బొల్లారం నిలయానికి రావడం ఇది తొలిసారి. సాధారణంగా వర్షాకాలం, శీతాకాలం విడిది కోసం ఇక్కడికి రావడం ఆనవాయితీ. కొన్ని కారణాల వల్ల దశాబ్దంన్నర నుంచి రాష్ట్రపతులు శీతాకాల విడిది మాత్రమే నిర్వహిస్తున్నారు. మధ్యలో ప్రణబ్‌ ముఖర్జీ ఒకసారి వర్షాకాల విడిది చేశారు. తాజాగా ద్రౌపది ముర్ముకు తొలి పర్యటన కావడంతో  ప్రత్యేకత కనిపించేలా  యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని