logo

ముంచుకొస్తున్న ముప్పు!

గతేడాది నవంబరులో శివారెడ్డిపేట సమీపంలో రహదారిపై నిలిపి ఉంచిన లారీని తెల్లవారుజామున మంచు కురుస్తున్న సమయంలో ద్విచక్ర వాహనం వెనుక నుంచి ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి చెందారు.

Published : 10 Dec 2022 03:25 IST

అప్రమత్తత తప్పనిసరి

వికారాబాద్‌, న్యూస్‌టుడే

వికారాబాద్‌ పట్టణంలో వాహన లైట్లతో..

గతేడాది నవంబరులో శివారెడ్డిపేట సమీపంలో రహదారిపై నిలిపి ఉంచిన లారీని తెల్లవారుజామున మంచు కురుస్తున్న సమయంలో ద్విచక్ర వాహనం వెనుక నుంచి ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి చెందారు.

డిసెంబరులోనూ అనంతగిరిగుట్టపై ఓ కారు లోయలోకి దూసుకెళ్లి ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

శీతాకాలంలో వేకువ జామున రహదారులను మంచు కమ్మేస్తోంది. ఆ మార్గంలో ఏమున్నాయో తెలియక వాహనదారులకు అవస్థలు తప్పడంలేదు. ఏ మాత్రం ఎమరుపాటుగా ఉన్నా, ప్రమాదాలు తప్పవు. ప్రస్తుతం జిల్లాలో రోజురోజుకూ పొగమంచు ప్రభావంతో ప్రయాణికులతో పాటు ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

వికారాబాద్‌ పట్టణంలో గత వారం రోజుల నుంచి దీపాలు వెలిగించుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామున  నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ సమయంలో వాహన రాకపోకలపై నియంత్రణ ఉండాల్సిన అధికారగణం ఈ దిశగా దృష్టి సారించడం లేదు. దీంతో భారీ వాహనాలు, ఇతర వాహనాల చోదకులు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నారు. మరో వైపు పోలీసులు ఈ పరిస్థితిపై సరైన అవగాహన కల్పించడం లేదు.

కారణాలు

* మంచుతో ముందు మార్గం కనిపించకున్నా అలాగే ప్రయాణించడం.

* రహదారి దాటేప్పుడు, చౌరస్తాల కూడలి వద్ద నేరుగా దాటేందుకు ప్రయత్నించడం.

* చేతి వణుకుతో  స్టీరింగ్‌ సహా హ్యాండిల్‌ అదుపు తప్పడం.

* మసక వెలుతురులో దగ్గరకు వచ్చే వరకు వాహనాలను గుర్తించకపోవడం.

* రహదారికి ఇరువైపులా సరిహద్దు సూచికలు లేనందున వాహనాలు అదుపు తప్పి బోల్తా పడుతున్నాయి.

* మలుపుల్లో సక్రమంగా దారి కనిపించకపోవడం.

ఇలా చేస్తే మేలు..

* మసక వెలుతురులో ప్రయాణాన్ని కొనసాగించవద్దు.

* రహదారి దిగువ భాగంలో వాహనాలు ఆపాలి.

* కొత్త మార్గాల్లో మలుపులు, రహదారుల స్థితిపై అవగాహన ఉండదు. మంచు తొలిగిపోయాకే ప్రయాణాన్ని కొనసాగించాలి.

* క్యాబిన్‌ అద్దం తొందరగా తేమను పట్టేస్తుంది. లోపల, వెలుపల పొడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి.

* వాహనాన్ని నడిపేటప్పుడు చోదకులు తప్పనిసరిగా చేతి తొడుగులు వాడితే మంచిది.


అవగాహన కల్పిస్తున్నాం
శ్రీను, సీఐ, వికారాబాద్‌

మంచు ప్రభావంతో ఎదురయ్యే పరిస్థితులపై వాహనచోదకులకు సరైన సూచనలు ఇస్తున్నాం. ప్రధానంగా రహదారులపై ఈ సమయాన ప్రయాణాన్ని ఆపాల్సిందిగా కోరుతున్నాం. ఆగి ఉన్న వాహనాలు ఎక్కడైనా ఉన్నట్లుగా గుర్తిస్తే గస్తీ పోలీసులు వాటిని ఎప్పటికప్పుడు ఆ ప్రాంతం నుంచి పంపిస్తున్నారు. సాధ్యం కాకపోతే రెండు వైపులా సిగ్నల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని