logo

కోతకొచ్చినా.. కోసుకోలేక..

వాతావరణ ప్రభావం అరటి రైతులను కోలుకోలేని దెబ్బతిస్తోంది. చేతికి వచ్చే దశలో పంటకు తెగులు సోకి నష్టపోతున్నారు. కోతకు వచ్చిన వారం రోజుల వ్యవధిలో కాయలు కుళ్లిపోతున్నాయి.

Updated : 10 Dec 2022 05:23 IST

తెగులు సోకి అరటి పంటకు నష్టం

కాయల దుస్థితి

పెద్దేముల్‌, న్యూస్‌టుడే: వాతావరణ ప్రభావం అరటి రైతులను కోలుకోలేని దెబ్బతిస్తోంది. చేతికి వచ్చే దశలో పంటకు తెగులు సోకి నష్టపోతున్నారు. కోతకు వచ్చిన వారం రోజుల వ్యవధిలో కాయలు కుళ్లిపోతున్నాయి. పంటను రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మార్కెట్‌లో అరటికి మంచి డిమాండ్‌ ఉంది. అందుకు తగ్గట్లు వారు ఎడాదిగా పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం అధిక వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల తెగులు సోకి చేతికి రావడంలేదు. పెట్టుబడులు సైతం దక్కే పరిస్థితి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

500 ఎకరాల్లో..:

పెద్దేముల్‌, బంట్వారం, కోట్‌పల్లి, వికారాబాద్‌, తాండూరు, పరిగి మండలాల్లో సుమారు 500 ఎకరాల్లో పంట సాగవుతోంది. ముఖ్యంగా తొర్మామిడి, గాజీపూరు, తింసాన్‌పల్లి గ్రామాల్లో అధికంగా సాగయింది. హెక్టారుకు ప్రభుత్వం రూ.18 వేల రాయితీని అందజేస్తుంది. రెండో ఏడాది రూ.9 వేల రాయితీ అందుతుంది. ఎకరాకు రైతులు రూ.80 వేల పెట్టుబడి పెట్టి పంటను సాగు చేశారు. తెగులు సోకి పంటకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గతంలో మార్కెట్లో అరటి కిలో రూ.12 చొప్పున విక్రయించారు. ప్రస్తుతం ధర అమాంతం పడిపోయి కిలో రూ.8కే విక్రయిస్తున్నారు.


అంచనాలు తారుమారు
షకీల్‌, రైతు, పెద్దేముల్‌

మూడు ఎకరాల్లో సాగు చేశా. గెల రూ.200 చొప్పున విక్రయించేందుకు ఒప్పందం కుదిరింది. పంట చేతికి వచ్చే దశలో తెగుళ్లు సోకి పాడైపోయి, ధర తగ్గడంతో రూ.5లక్షల నష్టం జరిగింది. అంచనాలు తారుమారు అయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలి.


తీవ్రమైన చలి ప్రభావమే
కమల, జిల్లా ఉద్యానవన అధికారిణి

అరటి పంటపై వాతావరణ ప్రభావం ఉంది. తీవ్రమైన చలి వల్ల సీలింగ్‌ తెగులు సోకుతోంది. పక్వానికి రాగానే పాడై రాలిపోతుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంటను నాటితే ఇదే పరిస్థితి ఉంటుంది. జూన్‌, జులై ల్లో పంటను సాగు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని