logo

సత్వరం స్పందిస్తేనే.. ఫలితం!

‘‘మనకు వినియోగదారుల ప్రాధ్యాన్యాలే ముఖ్యం. తాగునీరు, మురుగునీరు సమస్యలున్నాయంటూ మెట్రో కస్టమర్‌కేర్‌కు ఫిర్యాదులు చేసినా, ట్విటర్‌తో మనదృష్టికి తెచ్చినా సత్వరం పరిష్కరించండి..వారి ఫిర్యాదుకు టోకెన్‌ నంబరివ్వడంతో సమస్య పరిష్కారమైందా?

Published : 10 Dec 2022 03:22 IST

కలుషిత తాగునీటిపై చర్యలు కరవు

జేఎన్‌టీయూ మార్గంలో మురుగు ప్రవాహం

‘‘మనకు వినియోగదారుల ప్రాధ్యాన్యాలే ముఖ్యం. తాగునీరు, మురుగునీరు సమస్యలున్నాయంటూ మెట్రో కస్టమర్‌కేర్‌కు ఫిర్యాదులు చేసినా, ట్విటర్‌తో మనదృష్టికి తెచ్చినా సత్వరం పరిష్కరించండి..వారి ఫిర్యాదుకు టోకెన్‌ నంబరివ్వడంతో సమస్య పరిష్కారమైందా? లేదా? తెలుసుకోవాలి. కలుషిత నీటిపై తరచూ వచ్చే ఫిర్యాదులను అధ్యయనం చేసి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టండి..’’

-వినియోగదారుల ఫిర్యాదులపై జలమండలి ఎండీ దానకిశోర్‌ అధికారులతో ఇటీవల నిర్వహించిన సమీక్షలో అన్నమాటలివి...

ఈనాడు,హైదరాబాద్‌: ప్రజల నుంచి వస్తోన్న సంబంధిత ఫిర్యాదులపై వేగంగా స్పందించాలంటూ ఉన్నతాధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది నుంచి తక్షణ స్పందన కొరవడింది. ట్విటర్‌ ద్వారా ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేస్తుంటే... ఫలానా సెక్షన్‌ మేనేజర్‌ పరిష్కరిస్తారంటూ ట్వీట్‌ ద్వారా సమాధానాలు చెబుతున్నారు. చాలామంది ఫోన్లు చేస్తుంటే అధికారులు వస్తారంటున్నారు తప్ప.. పరిష్కారానికి చొరవచూపడం లేదు.

* నగరంలోని ప్రధాన ప్రాంతాలు, పాతబస్తీలోని కొన్నిప్రాంతాల్లో అనుసంధాన రోడ్లతో పాటు గల్లీల్లోనూ మురుగునీరు ప్రవహిస్తోంది. నెటిజన్లు, స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నారు. గతంలో ఫిర్యాదుచేసిన వెంటనే వెళ్లే సిబ్బంది, ప్రస్తుతమలా స్పందించడంలేదు. ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. మెహిదీపట్నంలోని అయోధ్యనగర్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ ఖాజా కమ్రుద్దీన్‌.. తాము నివసించే ప్రాంతంలో ఇరవైరోజులుగా మురుగు ప్రవహిస్తోందని ట్వీట్‌ చేశారు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూ వద్ద మురుగునీటి ప్రవాహంపై మరో నెటిజన్‌ చంద్రకాంత్‌ ఫోటోలను ట్విటర్‌ ద్వారా పోస్ట్‌ చేశారు.

* మురాద్‌నగర్‌ సాజిద్‌చౌక్‌లో తమ ఇంటికి నెలనుంచి కలుషిత తాగునీరు వస్తోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితంలేదని షఫివుల్లాఖాన్‌ ట్విటర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులు.. విజయ్‌నగర్‌కాలనీ డీజీఎం, ఆసిఫ్‌నగర్‌ సెక్షన్‌ఆఫీసర్‌ సాధ్యమైనంత త్వరగా వస్తారంటూ సమాధానం ఇచ్చారు.

* జహనుమాలోని బాయ్స్‌టౌన్‌ స్కూల్‌ సమీపంలో ఉంటున్నవారికి తాగునీరు, మురుగునీరు కలిసి వస్తున్నాయి. రెణ్నెల్లుగా సమస్య కొనసాగుతోందని, నల్లానీళ్లు దుర్వాసన వస్తున్నాయని స్థానికులు ఫిర్యాదుచేస్తున్నా జలమండలి అధికారులు స్పందించడంలేదు. విధి లేక మినరల్‌ వాటర్‌ కొని వినియోగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని