logo

మన ఆలోచనలు.. ప్రవర్తనతోనే రుగ్మతలకు చికిత్స

భారతీయ సనాతన సంప్రదాయ వైద్య విధానాన్ని ప్రపంచానికి ప్రచారం చేసేందుకు ది అసోసియేషన్‌ ఆఫ్‌ హెల్త్‌ సైకాలజిస్ట్స్‌ నిర్ణయించింది.

Published : 10 Dec 2022 03:22 IST

భారతీయ సంప్రదాయ వైద్య విధానంపై సదస్సు

ఈనాడు, హైదరాబాద్‌: భారతీయ సనాతన సంప్రదాయ వైద్య విధానాన్ని ప్రపంచానికి ప్రచారం చేసేందుకు ది అసోసియేషన్‌ ఆఫ్‌ హెల్త్‌ సైకాలజిస్ట్స్‌ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం నుంచి హెచ్‌సీయూలో వర్చ్యువల్‌గా మూడు రోజుల సదస్సు ప్రారంభమైంది. భక్తి వేదాంత రీసెర్చ్‌ సెంటర్‌ (బీఆర్‌సీ), స్టాక్‌హోం విశ్వవిద్యాలయం, శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ సహకారంతో సదస్సు నిర్వహిస్తున్నారు. దీనికి హెచ్‌సీయూ ఉపకులపతి ప్రొ.బీజేరావు ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. తొలి రోజున మంజూ అగర్వాల్‌ కీలకోపన్యాసం చేశారు. ప్రధానంగా భారతీయ సంప్రదాయ వైద్య విధానం, ఆచార-ఆధ్యాత్మిక విధానాలలో చికిత్సలు, ఆరోగ్య సంరక్షణలో జీవ, మానసిక, సామాజిక విధానాలు, హెల్త్‌ సైకాలజీలో భారత భాగస్వామ్యంపై సదస్సులో చర్చలు చేపట్టారు. అసోసియేషన్‌ ఆఫ్‌ హెల్త్‌ సైకాలజిస్ట్స్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు ప్రొ.మీనా హరిహరన్‌ మాట్లాడుతూ.. మనిషికి ఎదురవుతున్న వివిధ రుగ్మతలకు సనాతన సంప్రదాయ వైద్య విధానంలో చికిత్స అందించే ప్రక్రియపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఆలోచనలు, ప్రవర్తన, జీవన విధానం, సామాజిక ప్రవర్తనతో వ్యాధులను దూరం చేయాలన్నారు.  కార్యక్రమానికి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి దువ్వూరు జమున, స్టాక్‌హోం యూనివర్సిటీ ప్రతినిధి డాక్టర్‌ ఫెర్నాండో సర్దెలా, భక్తి వేదాంత రీసెర్చ్‌ సెంటర్‌ ప్రతినిధి డాక్టర్‌ సుమంత సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని