logo

డ్రైవింగ్‌ స్కూళ్లతో లైసెన్సులకు బ్రేక్‌

కార్లు నడిపేందుకు డ్రైవింగ్‌ స్కూళ్లలో శిక్షణ పొందినవారు ఆయా స్కూళ్ల ద్వారా లైసెన్సులు పొందే విధానాన్ని రవాణా శాఖ అధికారులు ప్రస్తుతానికి నిలిపివేయనున్నారు.

Updated : 11 Dec 2022 10:05 IST

ఈనాడు, హైదరాబాద్‌

కార్లు నడిపేందుకు డ్రైవింగ్‌ స్కూళ్లలో శిక్షణ పొందినవారు ఆయా స్కూళ్ల ద్వారా లైసెన్సులు పొందే విధానాన్ని రవాణా శాఖ అధికారులు ప్రస్తుతానికి నిలిపివేయనున్నారు. లైసెన్సుల జారీ ప్రక్రియలో కొన్ని సాంకేతిక అంశాలకు సంబంధించి డ్రైవింగ్‌ స్కూళ్ల వద్ద వనరులు లేకపోవడం, గ్రేటర్‌ పరిధిలో సుమారు 90 కేంద్రాలకు అనుమతులు లేవని గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఇకపై  డ్రైవింగ్‌ స్కూళ్లలో తనిఖీ చేయాలని,  ప్రమాణాలకు అనుగుణంగా లేని వాటిపై కేసుల నమోదు, అనుమతులను రద్దు చేయనున్నారు.

నగరంలో రెండొందలకుపైనే..

కారు నడపడం నేర్పిస్తామంటూ డ్రైవింగ్‌ స్కూళ్ల పేరుతో రెండుమూడు కార్లు, ఒక గది ఏర్పాటుచేసి వాటినే శిక్షణ కేంద్రాలుగా కొందరు నిర్వాహకులు ప్రచారం చేసుకుంటున్నారు. గ్రేటర్‌ పరిధిలో అధికారికంగా 80 డ్రైవింగ్‌ స్కూళ్లుంటే.. అనధికారికంగా 200పైనే ఉన్నాయని రవాణాశాఖ అధికారుల అంచనా. నెల రోజుల్లో డ్రైవింగ్‌ నేర్పించి రూ.7వేల నుంచి రూ.10వేల వరకు తీసుకుంటున్నారు. అనంతరం ఆర్టీఏ ఏజెంట్లతో  డ్రైవింగ్‌ లైసెన్సులు సులభంగా ఇప్పిస్తున్నారు. కొన్ని డ్రైవింగ్‌ స్కూళ్లు ఎక్కువ మందికి డ్రైవింగ్‌ నేర్పించేందుకు అదనంగా కార్లను కొంటున్నారు. వాస్తవానికి డ్రైవింగ్‌ స్కూల్‌కు అనుమతి తీసుకున్నప్పుడు ఎన్ని కార్లున్నాయో దరఖాస్తులో పేర్కొనాలి. దరఖాస్తులో రెండు కార్లు అని తెలిపి, మరో రెండుమూడింటిని తిప్పుతున్నారు.

మూడు సైన్‌బోర్డులు.. నాలుగు కుర్చీలు

గ్రేటర్‌లోని డ్రైవింగ్‌ స్కూళ్లలో 70శాతం వరకు ప్రమాణాలకు అనుగుణంగా లేవని రవాణాశాఖ అధికారులు గుర్తించారు. మూడు సైన్‌బోర్డులు, నాలుగు కుర్చీలు, ఒక టేబుల్‌ ఉంటే చాలన్నట్లుగా వాటి నిర్వాహకులు భావిస్తున్నారు. మోటార్‌ వాహన చట్టం 1988 ప్రకారం డ్రైవింగ్‌ స్కూళ్లలో శిక్షకులకు తరగతి గదులుండాలి,  వేగ పరిమితులు, ఇతర గుర్తులు వారికి గుర్తుండేలా చెప్పాలి. ఇందుకు విరుద్ధంగా  నెలరెణ్నెల్లు శిక్షణ ఇచ్చి లైసెన్సు ఫీజు కంటే ఐదారు రెట్లు వసూలు చేసుకుని లైసెన్సు ఇప్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని