logo

Adibatla kidnap case: ‘మిస్టర్‌ టీ’ ఎండీ నవీన్‌రెడ్డిపై రోజుకో కొత్త విషయం..

మన్నెగూడలో బీడీఎస్‌ విద్యార్థిని అపహరణ కేసులో ప్రధాన సూత్రధారి ‘మిస్టర్‌ టీ’ ఎండీ నవీన్‌రెడ్డి గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.

Updated : 13 Dec 2022 10:07 IST

ఈనాడు, హైదరాబాద్‌; ఆదిభట్ల, న్యూస్‌టుడే: మన్నెగూడలో బీడీఎస్‌ విద్యార్థిని అపహరణ కేసులో ప్రధాన సూత్రధారి ‘మిస్టర్‌ టీ’ ఎండీ నవీన్‌రెడ్డి గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇతనిపై గతంలో మూడు కేసులున్నాయి. 2019లో వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో ఒకటి, కాచిగూడలో రెండు వేర్వేరు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్‌లో ఇంతెజార్‌గంజ్‌ ఠాణాలో ఛీటింగ్‌, ఐటీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. అదే ఏడాది కాచిగూడలో రోడ్డు ప్రమాదం కేసు ఉంది. తనకు వైద్య విద్యార్థినికి వివాహం అయిందంటూ ఆమె పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా తెరిచి.. ఫొటోలు ఉంచడంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు రెండు నెలల క్రితం ఆదిభట్ల ఠాణాలో నవీన్‌రెడ్డిపై ఐటీ చట్టం కింద మరో కేసు నమోదైంది. తాజాగా హత్యాయత్నం, కిడ్నాప్‌ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతనిపై పీడీ చట్టం ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ ఇటీవల ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

తొండుపల్లిలో నిందితుడి కారు

యువతి కిడ్నాప్‌నకు నవీన్‌రెడ్డి ఉపయోగించిన కారును పోలీసులు శంషాబాద్‌ సమీపంలోని తొండుపల్లి జడ్పీ పాఠశాల సమీపంలో గుర్తించారు. కిడ్నాప్‌ అనంతరం పోలీసుల విస్తృత తనిఖీల నేపథ్యంలో భయపడ్డ నవీన్‌ యువతిని వదిలేశాడు. కారులో వెళ్తే ఇబ్బంది ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని తొండుపల్లి వద్ద దాచాడు. రెండ్రోజులుగా కారు అక్కడే ఉంది. నిందితుడు సమీపంలోని ఓయో హోటల్‌లో ఒక రాత్రి బస చేసినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న కారులో మహిళ దుస్తులు, మద్యం సీసాలు ఉన్నట్లు తెలిసినా పోలీసులు ధ్రువీకరించడం లేదు. కిడ్నాప్‌నకు సంబంధించి బాధిత వైద్య విద్యార్థిని స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేయలేదని తెలుస్తోంది. నవీన్‌రెడ్డి అరెస్టు తర్వాత రికార్డు చేసే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని