logo

Hyderabad: కలల కొలువు సాధించకుండానే.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం చెందాడు. ఉప్పల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లికి చెందిన మేకల లిఖిత్‌ నవనీత్‌(24) దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ ప్రైవేటు వసతిగృహంలో ఉంటున్నారు.

Updated : 17 Dec 2022 08:45 IST

లిఖిత్‌

ఉప్పల్‌, కొత్తగూడెం నేర విభాగం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం చెందాడు. ఉప్పల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లికి చెందిన మేకల లిఖిత్‌ నవనీత్‌(24) దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ ప్రైవేటు వసతిగృహంలో ఉంటున్నారు. పోచారంలోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై స్నేహితుడు మచ్చ నవీన్‌తో కలిసి దిల్‌సుఖ్‌నగర్‌ బయలేరారు. ఉప్పల్‌లోని ప్రెస్‌క్లబ్‌ ప్రాంతంలో వెనుకాల నుంచి ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడుపుతూ వస్తున్నాడు. బస్సును తప్పించుకొనే క్రమంలో బైకుపై కుడివైపునకు వచ్చిన లిఖిత్‌ బ్యాలెన్స్‌ చేసుకోలేక రహదారిపై పడిపోయారు. పక్కనే ఉన్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడిపోవడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నవీన్‌కు గాయాలయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

‘ఎస్సై’ ఈవెంట్స్‌కు హాజరుకావాల్సిన తరుణంలో...

లిఖిత్‌ ఊహ తెలియని వయసులోనే తండ్రిని కోల్పోయాడు. అమ్మే అన్నీ తానై పెంచింది. ఆమె నమ్మకాన్ని నిలబెట్టాలని ఎంతో ఆశపడ్డారు. బీటెక్‌ పూర్తిచేసి ఆరు నెలల క్రితం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేపట్టారు. ఎస్సై కావాలని కలలు కనేవారు. ఇటీవల ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే.. త్వరలో ఖమ్మంలో జరిగే శరీర దారుఢ్య పరీక్షలకు సాధన చేస్తున్నారు. ఎస్సై అయ్యి కుటుంబానికి అండగా నిలవాలనుకున్నారు. ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో విధి వక్రీకరించింది. రెప్పపాటు ఘోరంలో తనయుడు కన్నుమూయడంతో తల్లి పద్మ విలపించిన తీరు చూపరులను కలచివేసింది. భర్త దూరమైనా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తూ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారామె. ఎంతో కష్టపడి కుమారుడు, కుమార్తెను బీటెక్‌ చదివించారు. చేతికందివచ్చిన తనయుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించడంతో నలుగురికీ గర్వంగా చెప్పుకొన్నారు.  తనయుడి మరణవార్త విని హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని