logo

కొనుగోళ్లలో కొత్త దారి!

ప్రభుత్వ దవాఖానాల్లో జరిగే కొనుగోళ్లలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెమ్‌ పోర్టల్‌లోకి ఒక్కో ఆసుపత్రి చేరుతోంది.

Published : 22 Dec 2022 04:43 IST

జెమ్‌ పోర్టల్లోకి ప్రభుత్వ దవాఖానాలు

ప్రభుత్వ దవాఖానాల్లో జరిగే కొనుగోళ్లలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెమ్‌ పోర్టల్‌లోకి ఒక్కో ఆసుపత్రి చేరుతోంది. ఇప్పటికే ఉస్మానియాలో కొన్నిరకాల పరికరాలు, సామగ్రిని జెమ్‌ పోర్టల్‌ ద్వారానే కొంటున్నారు. తాజాగా ఈ జాబితాలోకి గాంధీ ఆసుపత్రి చేరింది. ఫలితంగా జాతీయ స్థాయిలో నాణ్యమైన కంపెనీ సామగ్రిని సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.

* ప్రభుత్వ ఆసుపత్రులకు ఔషధాలు, పరికరాలు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) సరఫరా చేస్తుంది. ఔషధాల్లో 80 శాతం మేర అందుతాయి. మరో 20 శాతం సమకూర్చుకునేందుకు ఆసుపత్రులకు అవకాశం ఉంది.
* వీటితోపాటు ఆరోగ్యశ్రీ నిధుల ద్వారా రోగులకు అవసరమయ్యే పరికరాలు, శస్త్రచికిత్సల సామగ్రి కొంటుంటారు. ఏటా ఇలా రూ.కోట్లలోనే వ్యాపారం నడుస్తుంటాయి. వీటిని సమకూర్చుకునేందుకు ఇప్పటి వరకు సాధారణ టెండరు విధానం పాటిస్తున్నారు.
* ఈ విధానంలో ఎక్కువ శాతం అవకతవకలకు ఆస్కారం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. గుత్తేదారులు కుమ్మకై టెండర్లు దక్కించుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. ఆసుపత్రుల్లోని కొందరు అధికారులు కమీషన్ల యావలో పడి నాణ్యత గాలికి వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి.

మారిన విధానంతో...

* ఇలాంటి అవకతవకలను వీల్లేకుండా కేంద్ర ప్రభుత్వం సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ సహకారంతో 2016లో జెమ్‌ పోర్టల్‌ అందుబాటులోకి తెచ్చింది.
* ఇప్పటికే టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ కొన్ని పరికరాలను ఈ పోర్టల్‌ ద్వారా కొంటోంది. మరికొన్నింటికి సాధారణ టెండర్లు పిలుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రులు స్వయంగా కొనే పరికరాలు, మందులు ఇతర సామగ్రి కోసం ఈ జెమ్‌ పోర్టల్‌ను ఎంచుకుంటున్నాయి.
* ఈ పోర్టల్‌లో రకరకాల వ్యాపార సంస్థలు నమోదై ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఈ-టెండర్‌తో సమానమే.
* జాతీయ స్థాయిలో పోటీ ఉండటం వల్ల గుత్తేదారులు కుమ్మక్కయ్యే అవకాశం తక్కువ. ఎక్కువ కంపెనీలు ఉండటంతో నాణ్యత ఉన్న వస్తువులు.. తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గాంధీలో ఇక నుంచి జెమ్‌ పోర్టల్‌లో కొనుగోలు చేయనున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు.

ఈనాడు, హైదరాబాద్‌,  న్యూస్‌టుడే, గాంధీ ఆసుపత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని