logo

Hyderabad: అక్కడ డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ వస్తుందా?

ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు ఎన్నికల తర్వాత మెట్రో విస్తరణ ఉంటుందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవల ప్రకటించడంతో ఆ ప్రాంతవాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Updated : 28 Dec 2022 08:28 IST

ఎల్‌బీనగర్‌-మల్కాపూర్‌ మార్గంలో జాతీయ రహదారి విస్తరణ

నాగ్‌పూర్‌లో పైన మెట్రో, కింద రహదారి  

ఈనాడు, హైదరాబాద్‌: ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు ఎన్నికల తర్వాత మెట్రో విస్తరణ ఉంటుందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవల ప్రకటించడంతో ఆ ప్రాంతవాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. భవిష్యత్తులో చేపట్టబోయే ఈ ప్రాజెక్టుకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఇంజినీర్లు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇదే మార్గంలో ప్రస్తుతం ఎల్బీనగర్‌ నుంచి మల్కాపూర్‌ వరకు 25 కి.మీ. మేర జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలు కావాల్సి ఉంది. ఇందులో భాగంగా వాహనాలు సాఫీగా వెళ్లేందుకు వీలుగా కొన్నిచోట్ల పైవంతెనలను ప్రతిపాదించారు. వాటిని నిర్మిస్తే .. మెట్రో మార్గం రహదారి మధ్యలో కాకుండా సర్వీసు దారిలో భవనాల పక్క నుంచి వెళ్లాల్సి వస్తుంది. విస్తరణ పనులు చేపడుతున్న ఆర్‌ అండ్‌ బీ, హైదరాబాద్‌ మెట్రో సమన్వయంతో వ్యవహరిస్తే నాగ్‌పూర్‌ మాదిరి డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌తో కింద రహదారి, పైన మెట్రో వెళ్లేలా డిజైన్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఖర్చూ కలిసి వస్తుంది. రెండుసార్లు పనులతో వాహనదారులకు ఇబ్బందులే కాకుండా.. ఇప్పుడు కొత్తగా నిర్మించే రహదారినీ తవ్వాల్సి వస్తుంది. ఏ రకంగా చూసినా ఏకకాలంలో రెండు పనులను చేయడం ఉత్తమం.

నాగ్‌పూర్‌లో ఇంజినీరింగ్‌ పరిష్కారంతో.. : నాగ్‌పూర్‌లో ఐదేళ్ల క్రితం జాతీయ రహదారిపై ఫ్లైఓవర్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఇదే మార్గంలో మెట్రోరైలు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక్కడే అధికారులు ఇంజినీరింగ్‌ పరిష్కారం ఆలోచించారు. కేంద్ర మంత్రి గడ్కరీ ప్రోత్సహించారు. ఫలితంగా జాతీయ రహదారులు, మెట్రోరైలు సంస్థ సమన్వయంతో డబుల్‌ డెక్కర్‌ వయాడక్ట్‌ నిర్మాణ డిజైన్‌ను రూపొందించాయి. దీంతో అదనంగా భూసేకరణ తిప్పలు తప్పాయి. నిర్మాణ వ్యయం 40 శాతం తగ్గింది. సమయం ఆదా అయింది. ఒకే స్తంభంపై 3.4 కి.మీ. దూరం ఫ్లైఓవర్‌, మెట్రో నిర్మాణంతో నాగ్‌పూర్‌ మెట్రో ఇటీవల గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులకు ఎక్కింది. 

ఇప్పుడు ఎంత కష్టమో చూడండి... : బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌ (వయా కొండాపూర్‌) వరకు ప్రతిపాదిత మెట్రోరైలు రెండోదశ మార్గంలోనే నాలుగు ఫ్లైఓవర్లను నిర్మించాలని నిర్ణయించారు. ఒకే మార్గంలో మెట్రో, ఫ్లైఓవర్లు వస్తుండటంతో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టేందుకు పురపాలక, జీహెచ్‌ఎంసీ అధికారులు, నాటి మేయర్‌ నాగ్‌పూర్‌ వెళ్లి అధ్యయనం చేసి వచ్చారు. కానీ డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ లేకుండానే షేక్‌పేట్‌, బయోడైవర్సిటీ, కొత్తగూడలో ఫ్లైఓవర్లు నిర్మించారు. ఇప్పుడు రెండోదశలో ఈ మార్గంలో మెట్రోకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రైట్‌ ఆఫ్‌ వే పెద్ద సమస్యగా మారింది. చాలా చోట్ల భూసేకరణ సమస్యలు తలెత్తనున్నాయి.

ఆర్‌ అండ్‌ బీ సానుకూలం: ఎల్‌బీనగర్‌-మల్కాపూర్‌ మార్గంలో విస్తరణ ఎన్‌హెచ్‌ఏఐ నిధులతో చేపడుతున్నా.. పనుల బాధ్యత ఆర్‌అండ్‌ బీదే. మెట్రో విస్తరణకు అనుగుణంగా పనిచేసేందుకు తాము సిద్ధమని.. కావాలంటే కొన్నిరోజులు వాయిదా వేస్తామని ఆర్‌ అండ్‌ బీ అధికారులు అంటున్నారు. దీనిపై మెట్రో అధికారులు స్పందించాల్సి ఉంటుంది.

గడ్కరీ అప్పుడే సూచన.. : నగరాల్లో జాతీయ రహదారుల విస్తరణ ప్రణాళికలు భవిష్యత్తులో మెట్రో ఏర్పాటుకు అనుగుణంగా  ఉండాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ గతంలోనే సూచించారు. అలా లేని ప్రణాళికలను ఆయన తిప్పి పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు