logo

తొలితరం ఉద్యమ నేత శ్రీధర్‌రెడ్డి కన్నుమూత

తొలిదశ (1969) తెలంగాణ ఉద్యమాన్ని ఓయూ ఏ-హాస్టల్‌ నుంచి తీవ్రం చేసిన ఉద్యమనేత, విశ్వవిద్యాలయం అలుమ్ని సభ్యుడు డా.మిదుల శ్రీధర్‌రెడ్డి (78) సోమవారం బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు.

Updated : 03 Jan 2023 05:24 IST

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: తొలిదశ (1969) తెలంగాణ ఉద్యమాన్ని ఓయూ ఏ-హాస్టల్‌ నుంచి తీవ్రం చేసిన ఉద్యమనేత, విశ్వవిద్యాలయం అలుమ్ని సభ్యుడు డా.మిదుల శ్రీధర్‌రెడ్డి (78) సోమవారం బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. వికారాబాద్‌ జిల్లా చెల్లాపూర్‌ ఆయన స్వస్థలం. బాగ్‌అంబర్‌పేట్‌ డీడీకాలనీలో నివాసముంటున్నారు. సతీమణి విజయలక్ష్మి(ఓయూ కాలేజ్‌ ఆఫ్‌ఎడ్యుకేషన్‌ విశ్రాంత డీన్‌, ప్రిన్సిపల్‌), కూతురు కృష్ణశ్రీ ఉన్నారు. శ్రీధర్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ డిసెంబరు 26న ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని మంగళవారం ఉదయం 7నుంచి 11 గంటల వరకు నందిహిల్స్‌నివాసంలో బంధువులు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతామని, మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రముఖుల నివాళి: శ్రీధర్‌రెడ్డి మృతికి ముఖ్యమంత్రి  కేసీఆర్‌ ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. నమ్మిన విలువలకు కట్టుబడి, రాజీపడకుండా పనిచేశారన్నారు. ఆయన అకాల మరణం కాంగ్రెస్‌ పార్టీకి, తెలంగాణకు తీరని లోటని టీపీసీసీ అధ్యక్షుడు రేవంతర్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎంపీ వీహెచ్‌, అనంతుల శ్యామ్‌ మోహన్‌ ఆస్పత్రికి చేరుకొని శ్రీధర్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. టీపీసీసీ నేతలు మహేష్‌కుమార్‌ గౌడ్‌, జి.నిరంజన్‌, కుమార్‌రావు, మల్లు రవి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మానవతారాయ్‌ సంతాపం ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని