logo

Hyderabad: హమ్మయ్య.. స్లాట్లు పెరిగాయ్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కొత్త వాహనాలు కొంటున్న వారికి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్ల కోసం ఎదురు చూపులుండవు.. బైకులు, కార్లు కొనుగోలు చేసిన తర్వాత వారాలు, నెలలు దాటినా.. స్లాట్లు లభించని స్థితి నుంచి అవసరమైనన్ని స్లాట్లను రవాణాశాఖ అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు.

Published : 09 Jan 2023 08:27 IST

సులువుగానే డ్రైవింగ్‌ లైసెన్సులు.. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో కొత్త వాహనాలు కొంటున్న వారికి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్ల కోసం ఎదురు చూపులుండవు.. బైకులు, కార్లు కొనుగోలు చేసిన తర్వాత వారాలు, నెలలు దాటినా.. స్లాట్లు లభించని స్థితి నుంచి అవసరమైనన్ని స్లాట్లను రవాణాశాఖ అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ (టీఆర్‌) నంబర్లతో రహదారులపై వెళ్తుంటే ట్రాఫిక్‌ పోలీసులు చలానాలు రాస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తుండడంతో రవాణాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో రోజుకు 400 స్లాట్లు ఇస్తూ సర్వర్‌లో మార్పులు చేశారు.

రంగారెడ్డిలో అత్యధికం..

రంగారెడ్డి జిల్లాలో వాహనాల రిజిస్ట్రేషన్లు రాకెట్‌ వేగంతో దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్‌లో ఇంకా ఆంగ్ల అక్షరం ‘ఎఫ్‌’ సిరీస్‌తో ఉంటే, రంగారెడ్డి జిల్లా ‘జే’ వరకూ వెళ్లింది. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, అత్తాపూర్‌, మేడ్చల్‌ జల్లాలో పేట్‌ బషీరాబాద్‌, ఉప్పల్‌, కూకట్‌పల్లి ఆర్టీఏ కార్యాలయాల్లో డ్రైవింగ్‌ లైసెన్సులు, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్ల దరఖాస్తుల స్లాట్లు పెంచారు. రంగారెడ్డి జిల్లాలో రోజుకు అత్యధికంగా వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం 500 స్లాట్లు అందుబాటులో ఉంచారు. ఆర్సీ దరఖాస్తులకు అనుగుణంగా అవసరమైన్ని స్లాట్లు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు. ఇందుకోసం రవాణా శాఖ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బందిని తాత్కాలికంగా నియమించనున్నట్లు వివరించారు.

ఆన్‌లైన్‌.. మీ సేవలకు వెళ్లండి..

కొత్త వాహనాలకు సంబంధించి వాహనాల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు సకాలంలో ఇప్పిస్తామంటూ కొందరు ఆర్టీఏ ఏజెంట్లు వాహనదారులకు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో స్లాట్ల బుకింగ్‌ ఉన్నప్పుడే కొందరు ఏజెంట్లు హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. సర్వర్‌ సాయంతో కాస్త అటు, ఇటుగా బ్లాక్‌ చేస్తున్నారు. వాహనదారులు ఫిర్యాదులు చేస్తుండడంతో రవాణాశాఖ అధికారులు స్పందించారు. ఆన్‌లైన్‌లోనే స్లాట్లు నమోదు చేసుకోవచ్చని, ఏజెంట్ల వద్దకు వెళ్లొద్దని చెబుతున్నారు. మీసేవ కేంద్రాలకు వెళ్లి స్లాట్లు బుక్‌ చేసుకోవాలని, వారు ఇచ్చిన బుకింగ్‌ పత్రంతో నేరుగా రవాణాశాఖ కార్యాలయాలకు రావాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని