logo

నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ!

రాజధాని సికింద్రాబాద్‌లోని ఓ భవనంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.. పెద్దఎత్తున మంటలు.. దట్టమైన పొగ వ్యాపించడంతో.. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు బయటకు పరుగులు తీశారు.

Published : 21 Jan 2023 03:45 IST

న్యూస్‌టుడే, తాండూరు టౌన్‌, పరిగి, కొడంగల్‌, వికారాబాద్‌ మున్సిపాలిటీ

రాజధాని సికింద్రాబాద్‌లోని ఓ భవనంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.. పెద్దఎత్తున మంటలు.. దట్టమైన పొగ వ్యాపించడంతో.. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు బయటకు పరుగులు తీశారు. ఇరుకుగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కృషి చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన జిల్లాలో కూడా అధికారులు అప్రమత్తం కావాలన్న విషయాన్ని సూచిస్తోంది. రానున్నది ఎండాకాలం ఇప్పటి నుంచే జాగ్రత్త తీసుకోవడంతోపాటు, నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యాచరణ చేపడితే ప్రయోజనం ఉంటుంది.


తాండూరులో ఇరుకుగా

తాండూరు మహాత్మా గాంధీ కూడలి ప్రాంతం..

పట్టణంలో 15 వేల వరకు నివాస గృహాలు, 800 దాకా దుకాణాలున్నాయి. 100 వరకు  పైఅంతస్తుల భవనాల్లో వివిధ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. వీటిల్లో నిబంధనలు కానరావటం లేదు. మహాత్మా గాంధీ కూడలి నుంచి వినాయక కూడలి, భద్రేశ్వర దేవాలయం, నేతాజీ కూడలి, శివాజీ కూడలి, అంబేడ్కర్‌ కూడలి తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల్లో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వాటితో పాటు కొన్ని ఆస్పత్రులు, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు, సినిమా థియేటర్లు, హోటళ్లలోనూ అదే పరిస్థితి. అగ్నిమాపక శకటం, అంబులెన్సు తిరిగే వీలు లేకుండా భవనాలను దగ్గరగా నిర్మించారు.  

అవగాహన కల్పిస్తున్నాం: నాగార్జున, అగ్నిమాపక శాఖ అధికారి

ప్రతి శుక్రవారం పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు, ప్రాణ నష్టం జరగకుండా చేపట్టే చర్యలపై వివరిస్తున్నాం. ప్రమాదం జరిగినవెంటనే చరవాణి నంబరు 87126 99357కు సమాచారం ఇవ్వాలి.


జిల్లా కేంద్రంలోనూ..

వికారాబాద్‌ పట్టణంలో 12వేల గృహాలు, 1500 దాకా వ్యాపార సముదాయాలున్నాయి. నిబంధనలు ఎవరూ పాటించటం లేదు.ఆలంపల్లి రోడ్డు పాత గంజ్‌ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. దుకాణాలు ఇరుకుగా ఉన్నాయి. ప్రమాదం జరిగితే అక్కడికి అగ్ని మాపక శకటం, అంబులెన్సు వెళ్లటానికి వీలు లేకుండా ఉంది. కొన్ని భవనాలకు సెల్లార్లు ఉన్నాయి. దుకాణాల ముందు పార్కింగ్‌ స్థలాలు లేవు.

అమలయ్యేలా చూస్తున్నాం: వెంకటరమణారెడ్డి, వికారాబాద్‌

ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నాం. వ్యాపార సమూదాయాల్లో నిబంధ]నలు అమలు అయ్యేలా చూస్తున్నాం.  ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. చరవాణి నంబరు 87126 99354కు  సమాచారం ఇస్తే సత్వరం స్పందిస్తాం.


నామమాత్రపు చర్యలు

పరిగి బీజాపూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉంది. 8వేల దాకా నివాస గృహాలు ఉంటాయి. 600కు పైగా దుకాణాల సమూదాయాలున్నాయి. ఆస్పత్రులు ఏర్పాటువుతున్నా రక్షణ చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. ఇరుకైన ప్రాంతాల్లోనూ బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రమాదవశాత్తు ప్రమాదాలు చోటు చేసుకుంటే వాహనాలు అక్కడికి వెళ్లటం కష్ట తరమే. నిబంధనలు పాటించే విధంగా చర్యలు చేపడితే మేలు.  

పర్యవేక్షణ పెంచుతాం చంద్రమోహన్‌, పరిగి

గతంలో అనుమతులు ఉన్న భవనాలకు రెన్యూవల్స్‌ చేయించుకోవటానికి సమాచారం ఇస్తున్నాం. కొత్త నిర్మాణాలకు మాత్రం టీఎస్‌బీపాస్‌ ద్వారా అనుమతులు తీసుకుంటున్నారు. పాత వాటిపై పర్యవేక్షణ పెంచుతాం. చరవాణి నంబరు 95429 33449కు సమాచారం ఇవ్వాలి.


స్థలాలు లేక

కొడంగల్‌లో మొత్తం 3,321 నివాస గృహాలు, 80 వరకు వ్యాపార భవనాలున్నాయి. హోటళ్లు, పాఠశాలలు, దుకాణ సముదాయాల్లో నిబంధనలు పాటించటం లేదు. పరికరాలు కొన్ని చోట్ల ఉన్నాయి. భవనాల సెల్లార్లు ఖాళీగా ఉన్నాయి. దుకాణాల ముందు పార్కింగ్‌ స్థలాలు లేవు.

జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాం
పవన్‌కుమార్‌, కొడంగల్‌

పట్టణ ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రయాణ ప్రాంగణాలు, సినిమా థియేటర్లు, పాఠశాలలు వంటి ప్రాంతాల్లో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం. చరవాణి నంబరు 98665 51881కు సమాచారం ఇవ్వాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని