logo

దంపతులను బలిగొన్న ఆర్థిక ఇబ్బందులు

ఆర్థిక ఇబ్బందుల కారణంగా యువ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా మారందొడ్డి గ్రామానికి చెందిన వడ్ల వీరన్న కుమారుడు వడ్ల బ్రహ్మచారి(28) కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు.

Published : 21 Jan 2023 03:44 IST

బ్రహ్మచారి, మౌనిక

షాపూర్‌నగర్‌, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందుల కారణంగా యువ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా మారందొడ్డి గ్రామానికి చెందిన వడ్ల వీరన్న కుమారుడు వడ్ల బ్రహ్మచారి(28) కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్ల కిందట బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి జగద్గిరిగుట్ట పరిధి హనుమాన్‌నగర్‌లో నివాసముంటున్నాడు. స్థానికంగా కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్ల కిందట కర్నూలు జిల్లా సీబెళగల్‌ మండలం, బ్రాహ్మణదొడ్డి గ్రామానికి చెందిన మౌనిక(20)తో వివాహం జరిగింది. వివాహం అనంతరం దంపతులు ఇద్దరూ ఇక్కడే నివాసముంటున్నారు. బ్రహ్మచారికి సరిగా పనులు దొరక్క ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలుగా పనిలేక ఇంట్లో సరకులు తెచ్చుకోవడానిక్కూడా ఇబ్బంది పడ్డారు. ద్విచక్రవాహనం నెలసరి వాయిదా చెల్లించకపోవడంతో గురువారం అతని ద్విచక్రవాహనాన్ని ఫైనాన్స్‌ నిర్వాహకులు లాక్కెళ్లారు. పెళ్లయి మూడేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతోనూ వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. దీంతో మనస్తాపానికి గురైన భార్యాభర్తలు గురువారం రాత్రి తాము అద్దెకు ఉంటున్న గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని