logo

IT Jobs: కొలువులు తగ్గాయ్‌.. కోతలు పెరిగాయ్‌

ఐటీ సంస్థల్లో ఉద్యోగాల కోతలు గుబులురేపుతోంది.  కొవిడ్‌ సమయంలో ఐటీ సేవలకు డిమాండ్‌ పెరగడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నాయి. భారీ ప్యాకేజీలను ఆఫర్‌ చేశాయి. 

Updated : 22 Jan 2023 09:08 IST

నగరంలోని  ఐటీ ఉద్యోగుల్లో గుబులు
కాంట్రాక్ట్‌  సిబ్బందిపై  లేఆఫ్‌ల ప్రభావం
- ఈనాడు, హైదరాబాద్‌

టీ సంస్థల్లో ఉద్యోగాల కోతలు గుబులురేపుతోంది.  కొవిడ్‌ సమయంలో ఐటీ సేవలకు డిమాండ్‌ పెరగడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నాయి. భారీ ప్యాకేజీలను ఆఫర్‌ చేశాయి.  దాదాపు రెండేళ్లపాటూ ఐటీ బూమ్‌ నడిచింది. ఇప్పుడు పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా, యూరోప్‌లో ఆర్థిక మందగమన భయాలతో ఐటీ సంస్థలు ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. ఈ పరిణామాలు నగరంలోని ఐటీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 

కొత్త ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడంతో..

ఐటీ ఉద్యోగాల్లోనూ పలు రకాల నియామకాలు ఉన్నాయి. నేరుగా కంపెనీ పే రోల్స్‌పై పనిచేస్తున్న ఉద్యోగులు కొందరైతే.. కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా నిర్ణీత ప్రాజెక్ట్‌ కోసం పనిచేసేవారు మరికొందరు. లేఆఫ్‌ ప్రభావం ఎక్కువగా కాంట్రాక్ట్‌ ఐటీ ఉద్యోగులపై ఉంది.  కొత్త ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడంతో వీరి కొలువులు ఊడుతున్నాయి. అయితే ఈ ప్రభావం ఇంకా హైదరాబాద్‌లో లేదని.. ఉద్యోగాలు కోల్పోయిన దాఖలాలు ఇప్పటివరకు కన్పించలేదని ఒక ఐటీ సంస్థలో పేరోల్‌ విభాగంలో పనిచేసే ప్రతినిధి ‘ఈనాడు’తో అన్నారు.

బహుళజాతి సంస్థలైన మైక్రోసాఫ్ట్‌, మెటా, అమెజాన్‌, గూగుల్‌, దేశీయ సంస్థలు విప్రో, స్విగ్గీ తదితర కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీరికున్న కార్యాలయాల్లో 5 శాతం దాకా ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ఈ సంస్థలకు అమెరికా బయట ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నది హైదరాబాద్‌లోనే కావడంతో సహజంగానే కోతల ప్రభావం ఉంటుందని కలవరపడుతున్నారు.

ఉన్నవారితోనే సర్దుబాటు..

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం వరకు కూడా నియామకాల్లో వృద్ధి కన్పించినా..  ఆ తర్వాత క్రమంగా కంపెనీలు కొత్త నియామకాలను పూర్తిగా ఆపేశాయ్‌. ఉన్న ఉద్యోగులనే సర్దుబాటు చేస్తున్నాయి. వర్క్‌ ఫ్రం హోం క్రమంగా ఎత్తేస్తున్నాయి.  ‘ ఓ కంపెనీ నచ్చి  ఉద్యోగానికి సరే అన్నాను. కానీ వారు బెంగళూరులో పనిచేయాలంటున్నారు. దీంతో వదులుకున్నాను. బయట పరిస్థితులు చూస్తుంటే కొంత ఆందోళనగా ఉంది’ అని  ఐటీ రంగంలోని ఉన్నత ఉద్యోగి ఎస్‌.కె.గాంధీ అన్నారు.


తాత్కాలికమే..
ఓరుగంటి వెంకట్‌, అధ్యక్షుడు, కొంపల్లి ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ అసోసియేషన్‌

అంతర్జాతీయంగా లేఆఫ్‌ల ప్రభావం మనమీద కన్పించినా అది తాత్కాలికమే. దీర్ఘకాలికంగా ఇది మనకు మేలు చేస్తుంది. యూకే, యూఎస్‌లో రెండు ఉద్యోగాలు తీసేస్తే.. ఇక్కడ నాలుగు ఉద్యోగాలు వస్తాయి. కొత్తవారికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. టాప్‌ లెవల్‌లో ఉండే ఉద్యోగుల వేతనాలు ఎక్కువ కాబట్టి వీరి ఉద్యోగాలు కొన్ని పోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అక్కడ వచ్చింది కూడా సాఫ్ట్‌ క్రైసిస్‌ కాబట్టి మనపై ఎక్కువ ప్రభావం ఉండదు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. మారుతున్న టెక్నాలజీలకు తగ్గట్టుగా నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని