logo

అతడే కుటుంబానికి ఆధారం

జియాగూడలో పట్టపగలే జరిగిన జంగం సాయినాథ్‌(29) హత్య  పక్కా పథకం ప్రకారమే చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణకు వచ్చారు.

Published : 23 Jan 2023 02:15 IST

పథకం ప్రకారమే హత్య

సాయినాథ్‌

న్యూస్‌టుడే, జియాగూడ, అంబర్‌పేట్‌: జియాగూడలో పట్టపగలే జరిగిన జంగం సాయినాథ్‌(29) హత్య  పక్కా పథకం ప్రకారమే చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణకు వచ్చారు. అతని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. అంబర్‌పేట బతుకమ్మకుంట ప్రాంతానికి చెందిన స్వామి, భాగ్యలక్ష్మి దంపతులకు హేమలత, శ్రీలత, సాయినాథ్‌, మహేందర్‌ సంతానం. ఓ అపార్ట్‌మెంట్‌లో ఏడాదిన్నరగా అద్దెకు ఉంటున్నారు. పెద్ద అక్క విడాకులు పొందింది. చిన్న అక్క భర్త ఇటీవల గుండెపోటుతో మరణించాడు. అక్కలు, ఇద్దరు మేనల్లుళ్లు, పక్షవాతం బారిన పడిన తండ్రి బాధ్యత సాయినాథ్‌ తీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే కుటుంబ పోషణ భారమవుతుందనే ఉద్దేశంతో వివాహం వాయిదా వేస్తూ వస్తున్నాడు. పదో తరగతి వరకూ చదివి, కోఠి ఇసామియా బజార్‌లో గ్లాస్‌ కటింగ్‌ నేర్చుకున్నాడు. రామంతాపూర్‌లో అక్వేరియం దుకాణం నిర్వహిస్తూ, ఆర్డర్లపై గ్లాస్‌ కటింగ్‌ చేస్తుంటాడు. ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కుటుంబానికి ఎవరితోనూ కక్షలు లేవని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇన్నేళ్లలో ఎవరితోనూ గొడవ పడలేదని సోదరుడు మహేందర్‌ తెలిపాడు. ఇంత దారుణంగా చంపాల్సినంత అవసరం ఏమోచ్చిందో అర్థం కావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నిందితులను ముందెన్నడూ చూడలేదన్నారు. 

సీసీ ఫుటేజీ పరిశీలన...

సాయినాథ్‌ రామంతాపూర్‌ నుంచి పాత బస్తీ ఎందుకొచ్చాడనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. పురానాపూల్‌, జియాగూడ, బహదూర్‌పుర, కార్వాన్‌, అత్తాపూర్‌ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. హత్యకు పథక రచన చేసిన నిందితులు సాయినాథ్‌ కదలికలను గమనిస్తూ వచ్చారు. అతడిని అనుసరిస్తూ వచ్చిన ముగ్గురు అనువైన ప్రదేశం కోసం వెంబడించారు. జియాగూడ మేకల మండీ సమీపంలో జనసంచారం లేకపోవటాన్ని అవకాశంగా చేసుకొని             నిమిషాల వ్యవధిలో హతమార్చి పారిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని